తెలంగాణ సిఎం కేసీఆర్ కుటుంబం ఓ విచిత్రమైన స్థితిలో ఉందిప్పుడు. ఆయన బిఆర్ఎస్ పార్టీతో దేశాన్ని ఉద్దరిస్తానంటూ బయలుదేరుతుంటే, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులలో ఒకరని సీబీఐ, ఈడీ తేల్చి చెపుతున్నాయి.
పది రోజుల క్రితమే సీబీఐ ఆమెని ఈ కేసుకి సంబందించిన అంశాలపై ప్రశ్నించింది. తాజాగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసిన ఓ ఛార్జ్ షీట్లో కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలు ఈ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితులను పేర్కొంది.
వారందరూ కలిసి ‘సౌత్ గ్రూప్’గా ఏర్పడి ఢిల్లీలోని ఆమాద్మీ ప్రభుత్వంలో కొందరు ప్రముఖులతో ఒప్పందాలు చేసుకొని ఈ లిక్కర్ స్కామ్ చేశారని ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఈ స్కామ్‌లో రూ.10,000 కోట్లు ఆదాయం ఉంటుందని అంచనా వేసినందునే దీనిలో శరత్ చంద్రారెడ్డి కూడా జాయిన్ అయ్యారని పేర్కొంది.
దీనిలో రాజకీయ ప్రముఖులు (నిందితులు), వారి మద్యం కంపెనీల డైరెక్టర్లు అందరూ కలిసి మొత్తం 36 మంది ఉన్నారని ఛార్జ్ షీట్లో పేర్కొంది. వారందరూ వివిద సమయాలలో హైదరాబాద్, ఢిల్లీలోని పలుమార్లు సమావేశమయ్యారని పేర్కొంది. కల్వకుంట్ల కవిత, మాగుంట రాఘవ్ రెడ్డి భాగస్వాములుగా ఉన్న ఇండో స్పిరిట్స్ కంపెనీని అరుణ్ పిళ్ళై, ప్రేమ్ రాహుల్‌ని బినామీలుగా పెట్టుకొని నడిపించారని, వారి కంపెనీకి చెందిన ఢిల్లీలోని మద్యం షాపులకి కేజ్రీవాల్ ప్రభుత్వం ఎల్-1 లైసెన్స్ జారీ చేసిందని, వాటి ద్వారా వారికి భారీగా ఆదాయం సమకూరిందని ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఇప్పటి వరకు సుమారు రూ.100 కోట్లు పైనే చేతులు మారాయని ఛార్జ్ షీట్లో పేర్కొంది.
ఈ లిక్కర్ స్కామ్ బయటకి పొక్కినప్పటి నుంచి 36 మంది నిందితులు తరచూ ఫోన్లు ధ్వంసం చేస్తూ మారుస్తూ దీనికి సంబందించి ఎటువంటి సాక్ష్యాధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకొన్నారని పేర్కొంది. వారు మొత్తం 170 ఫోన్లు ధ్వంసం చేశారని, కానీ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ఒకటొకటిగా బయటపడ్డాయని ఈడీ ఛార్జ్ షీట్లో పేర్కొంది.
ఈ కేసులో నిందితులలో ఒకడైన సమీర్ మహేంద్రుపై ఈడీ అధికారులు కోర్టులో దాఖలు చేసిన ఈ ఛార్జ్ షీట్‌ని విచారణకి స్వీకరించి, జనవరి 5వ తేదీన తదుపరి విచారణ జరుపుతామని ఆలోగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరూ కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఆదేశించారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు బిజెపి ప్రతినిధులని ట్రాప్ చేసి జైలుకి పంపించామనే సంతోషం కేసీఆర్‌కి లేకుండా చేస్తోంది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్. బిజెపి ప్రతినిధులు జైల్లో ఉంటే దానికి పెద్దగా నష్టమేమీ లేదు. ఎలాగో వారిని విడిపించుకోగలదు. కానీ దేశంలో గుణాత్మకమైన మార్పు తెస్తానంటూ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న కేసీఆర్‌కి, సొంత కూతురు కల్వకుంట్ల కవిత ఈ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని ఉన్నప్పుడు ఆయన నీతి నిజాయితీ, స్వచ్చమైన, పారదర్శకమైన పాలన అంటూ మాట్లాడితే దేశ ప్రజలు నవ్వుతారు. పైగా ఆయన బిఆర్ఎస్తో ఎంత హడావుడి చేస్తే ఈ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత పేరు కూడా అంతే గట్టిగా దేశమంతా మారుమ్రోగేలా కేంద్రం చేయగలదు. కనుక ఈ లిక్కర్ స్కామ్ కేసీఆర్ జాతీయ రాజకీయాలకి చాలా ఇబ్బందికరంగానే మారవచ్చు.