KCR-BRS-Vijayawadaరాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఎంతగా నష్టపోయిందో అందరూ చూస్తూనే ఉన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో టిఆర్ఎస్‌తో అన్ని పార్టీలు పదేళ్ళు ఏకధాటిగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నాయి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. అమరావతిని, పోలవరాన్ని నిర్మించుకొని, రాష్ట్రానికి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకొని ఉంటే బాగుండేది. కానీ వైసీపీ ప్రభుత్వం అదీ చేయకపోవడంతో 8 తర్వాత కూడా రాజధాని లేని రాష్ట్రంగా, అభివృద్ధికి నోచుకోని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయింది.

నిజానికి రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్‌ తన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొన్నట్లే, టిడిపి, వైసీపీలు కూడా ఈ 8 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ దిశలో టిడిపి గట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ పాలనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దయనీయ పరిస్థితిలో ఉంది. ఇది స్వయంకృతమే కనుక ఎవరినీ నిందించలేము.

ఇటీవల అక్కడ తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీ జెండా ఆవిష్కరిస్తున్నప్పుడు, ఇక్కడ విజయవాడ, నెల్లూరుతో సహా పలు జిల్లాలలో కేసీఆర్‌కి అభినందనలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. అంటే ఏపీ ప్రజలు కేసీఆర్‌ని, బిఆర్ఎస్‌ని స్వాగతిస్తున్నారని అనుకోలేము. కేసీఆర్‌ ఝార్ఖండ్, బెంగళూరులో పర్యటించేటప్పుడు ఏవిదంగా తమ మిత్రపక్షాల సాయంతో తనకి స్వాగతం చెప్పించుకొంటూ బ్యానర్లు పెట్టించుకొన్నారో అదేవిదంగా ఆయన మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వంటివారు ఇక్కడ ఏపీలో తమకున్న రాజకీయ పరిచయాలతో బ్యానర్లు ఏర్పాటు చేయించి ఉండవచ్చు. తద్వారా కేసీఆర్‌ నాయకత్వాన్ని అన్ని రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయని, ఆయన జాతీయస్థాయి నాయకుడని ప్రమోట్ చేసుకోవడమే వాటి ఉద్దేశ్యంగా భావించవచ్చు.

ఏపీని కేసీఆర్‌ ఇంతగా దెబ్బతీసినా బిఆర్ఎస్‌కి స్వాగతం పలుకుతున్నది ఎవరు? ఎందుకు?అని ఆలోచిస్తే వచ్చే ఎన్నికల కోసమే వైసీపీ అమలుచేయబోతున్న మరో సరికొత్త రాజకీయ వ్యూహమై ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది.

ఏవిదంగా అంటే, తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే బిఆర్ఎస్‌ లబ్ది పొందుతున్నట్లే, ఏపీని ద్వేషిస్తున్న కేసీఆర్‌ పేరుతో ఏపీ ప్రజలలో సెంటిమెంట్ రగిలించడం ద్వారా వైసీపీ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నట్లుంది.

అక్కడ తెలంగాణలో ఇప్పటికే వైఎస్ షర్మిల ద్వారా తెలంగాణలో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడ ఏపీలో వైసీపీ నేతలు మూడు రాజధానులపేరుతో ప్రాంతీయ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

గత ఎన్నికలలో ఎన్నికలలో వైసీపీని గెలిపించేందుకు కేసీఆర్‌ ఎంతగానో సాయపడ్డారు. కనుక వచ్చే ఎన్నికలలో కూడా ఆయన వైసీపీకి సాయపడాలనుకొన్నా లేదా వైసీపీయే కేసీఆర్‌ సాయం తీసుకోవాలనుకొన్నా ఆశ్చర్యం లేదు.

జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గతంలో వైసీపీ సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసింది కనుక వచ్చే ఎన్నికలకు ముందు ఏపీలో బిఆర్ఎస్‌ ప్రవేశిస్తే దానిని వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ ప్రజలలో సెంటిమెంట్ రగిలించి లబ్ధిపొందేందుకు ప్రయత్నించవచ్చు.

ఇక వచ్చే ఎన్నికలలో చక్రం తిప్పి కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలనుకొంటున్నారు కనుక వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం చాలా ఉంటుంది. కర్ణాటకలో జేడీఎస్ అధినేత కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేస్తానని ఊరిస్తున్నట్లే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నివిదాల తోడ్పాటు అందిస్తానని కేసీఆర్‌ హామీ ఇస్తే ఆశ్చర్యం లేదు. కనుక కేసీఆర్‌ సాయంతో బిఆర్ఎస్‌ని బరిలో దింపి దాని ద్వారా టిడిపి, జనసేనలని దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నించవచ్చు. కనుక ఏపీలో బిఆర్ఎస్‌కి ఉత్తుత్తి శత్రువు, ఆప్తమిత్రుడు రెండూ వైసీపీయే అని భావించవచ్చు.