KCR-BRS-Delhiతెలంగాణ సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొన్నపుడు ప్రత్యేకవిమానం వేసుకొని చాలా రాష్ట్రాలు చుట్టబెట్టి పలు పార్టీల అధినేతలని, ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను కలిసి మాట్లాడారు. కానీ ఎవరితోనూ ఆయనకి పొసగలేదు. ఎందుకంటే ఆయన వారితో కలిసి పనిచేయాలనుకోలేదు… వారందరూ తన నాయకత్వాన్ని, తన ఆలోచనలను అంగీకరించాలని కోరుకొన్నారు కనుక!
ఎట్టకేలకు కర్ణాటకకు చెందిన కుమారస్వామి దొరికారు. “నాతో చెయ్యి కలిపితే నిన్ను కర్ణాటకకు ముఖ్యమంత్రిని చేస్తానని” కేసీఆర్‌ చెప్పడంతో ఆయన కేసీఆర్‌ చుట్టూ చాలా ప్రదక్షిణాలు చేశారు. కానీ తీరాచేసి కర్ణాటక ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కేసీఆర్‌ అటువైపు తొంగిచూడలేదు! కుమారస్వామి కూడా కేసీఆర్‌ సాయం అర్ధించలేదు!

నిజానికి కేసీఆర్‌ సినిమా హీరోలలాగ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌ వేరు. రాజకీయ నాయకుడు కేసీఆర్‌ వేరు.

మొదటి పాత్రలో ఆయన ఖచ్చితంగా హీరోయే. ఆయనకు మరెవరూ సాటిలేరు. అందుకే ప్రజలు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఆ ధైర్యంతోనే కేసీఆర్‌లోని రెండో పాత్ర అంటే రాజకీయ నాయకుడు నిద్రలేచి ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలను ఢీకొంటున్నాడని చెప్పవచ్చు. వారితో ఈ యుద్ధంలో కేసీఆర్‌ గెలుస్తారా లేదా?అనేది అప్రస్తుతం.

కానీ యుద్ధం ఆరంభించకమునుపే కేసీఆర్‌… నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, కుమారస్వామి, స్టాలిన్‌, జగన్‌ తదితరులను దూరం చేసుకొన్నారు.

నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీ ఇద్దరూ ప్రధాని కావాలని తహతహలాడుతున్నవారే కానీ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొన్నారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కలిసి పనిచేద్దామని నిర్ణయించుకొన్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌తో సహా దేశంలో కలిసివచ్చే పార్టీలన్నిటినీ కలుపుకుపోవాలని నిర్ణయించుకొన్నారు. కాంగ్రెస్ పార్టీని కలుపుకోవడం అంటే ప్రధాని పదవికి మరో పోటీదారు రాహుల్ గాంధీని తెచ్చిపెట్టుకోవడమే అని వారికీ తెలుసు. అయినా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి సిద్దపడుతున్నారు. కేసీఆర్‌ కూడా ప్రధాని కావాలని కలలు కంటున్నారు. కానీ వారిలా ‘కలిసి పనిచేసేందుకు’ ఇష్టపడటం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీని వద్దనుకొంటున్నారు కూడా.

లోక్‌సభలో బలాబలాలు చూసుకొంటే మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్లో 42, బిహార్‌లో 40, తమిళనాడులో 39, కర్నాటకలో 28, ఏపీలో 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. కనుక ఎక్కువ ఎంపీ సీట్లున్న పార్టీల అధినేతలు నాయకత్వం కోరుకోవడం సహజం. కానీ 17 ఎంపీ సీట్లు కూడా లేని కేసీఆర్‌ తన నాయకత్వాన్ని అందరూ అంగీకరించాలని కోరుకొంటున్నారు.

రాజకీయాలలో ఆరితేరిన కేసీఆర్‌కి ఇవన్నీ తెలియనివి కావు. కానీ తెలంగాణలో తన మాటకు ఎదురేలేకపోవడం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపాననే అతిశయం కారణంగా ఆయన ఎవరితో కలవలేకపోతున్నారని భావించవచ్చు. ఆయన జాతీయ రాజకీయాలకు ఇదే ప్రధాన అవరోదంగా కనిపిస్తోంది. కనుక ఆయన గులాబీ కారు ఎప్పటికైనా ఢిల్లీకి చేరుకొంటుందా?