KCR-BRS-BJPజియో టెలికాం సేవలలో కొత్త ఒరవడి సృష్టించినట్లే తెలంగాణ సిఎం కేసీఆర్‌ రాజకీయాలలో కొత్త ఒరవడిని సృష్టించారని చెప్పవచ్చు. ఉద్యమకారుడిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా మారిన తర్వాత టిఆర్ఎస్‌ను ఫక్తూ రాజకీయ పార్టీగా మార్చేశారు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఎదురే ఉండరాదని కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను నయాన్న, భయాన్న లొంగదీసుకొని టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేసుకొని వాటిని నిర్వీర్యం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే చేశారు.

ఒకప్పుడు ప్రజల మద్యన తిరుగుతూ ఉద్యమాలు నడిపించిన కేసీఆర్‌ ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అందనంత దూరంగా రాజమహల్ వంటి ప్రగతి భవన్‌ కట్టుకొని ఉంటున్నారు. ఒకప్పుడు సకలజనుల సహాయసహకారాలతో ఉద్యమాలు చేసిన కేసీఆర్‌, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరూ ఎటువంటి ఆందోళనలు, నిరసనలు తెలియజేయకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

బిఆర్ఎస్‌తో ఇతర రాష్ట్రాలలో కూడా రాజకీయాలు చేయాలనుకొంటున్న కేసీఆర్‌, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌, బిజెపిలతో సహా మరే పార్టీ తమతో పోటీ పడకూడదని కోరుకొంటున్నారు. అదే… టిడిపి కొద్దిగా యాక్టివ్ అయినా తెలంగాణను మళ్ళీ విచ్చినం చేసి దోచుకొనేందుకు వలస పాలకులు కుట్రలు పన్నుతున్నారని గట్టిగా వాదించడం మొదలుపెడతారు.

తెలంగాణ స్వపరిపాలనలో ఉండటం అంటే కేసీఆర్‌ ఉద్దేశ్యంలో తన కుటుంబ పరిపాలన అని కావచ్చు. కనుక ఇప్పుడు బిజెపి ఆయన ‘స్వపరిపాలన’ను సవాలు చేస్తోంది కనుక దానిపై ‘గుజరాతీ పార్టీ’ అనే ముద్ర వేసేశారు. ఒకవేళ దానిస్థానంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి ఉంటే, దానికీ ఏదో ఓ ముద్ర వేసేసేవారే.

మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా మారిపోవడానికి బిజెపి ఎంత కారణమో టిఆర్ఎస్‌ కూడా అంతే కారణమని అందరికీ తెలుసు. ఉపఎన్నికలకు ముందు నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిజెపిని అడ్డంగా బుక్ చేసి తన రాజకీయ చాణక్యానికి తిరుగులేదని మరోసారి నిరూపించుకొన్నారు కేసీఆర్‌.

ఒకవేళ బిజెపి నిజంగానే ఒక్కో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేకి వందకోట్లు ఇవ్వాలనుకొంటే అదేదో మంత్రి హరీష్‌ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి ముఖ్య నేతలకి ఇచ్చి పార్టీలోకి రప్పించుకోవాలనుకొంటుంది కానీ సొంత నియోజకవర్గంలో తప్ప బయట ఎక్కడా గుర్తింపులేని వారికి అంత సొమ్ము ఇవ్వదు కదా?

అయినా వంద కోట్లు ఇస్తానంటే ఏ ఎమ్మెల్యే అయినా కాదనగలడా? కానీ ఆ నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఆ ఆఫర్‌ని తృణప్రాయంగా కాలితో తన్నేశారని, వారు ప్రలోభాలకు లొంగిపోకుండా తెలంగాణలో బిజెపి కుట్రలు, కుతంత్రాలను వారు తిప్పికొట్టారని టిఆర్ఎస్‌ ప్రచారం చేసుకొంటోంది. కేసీఆర్‌ రాజకీయం బిజెపికి కూడా అర్దమైంది కానీ ఆయన కొట్టిన దెబ్బకి చిత్తయిపోవడంతో ఈ ఉచ్చులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.

ఈవిదంగా ఇంత అప్రజాస్వామ్యంగా, నిరంకుశంగా, కుటిలరాజకీయాలు చేస్తూ ప్రత్యర్ధులను నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తున్న కేసీఆర్‌, దేశాన్ని ఉద్దరిస్తానని, దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తెస్తానని చెపుతుండటం చాలా విడ్డూరంగా ఉంది. అంటే తాము చేస్తే సంసారం అదే.. ప్రత్యర్దులు చేస్తే వ్యభిచారం అన్నట్లుంది టిఆర్ఎస్‌ తీరు.