KCR-BJP-executive-meet-Hyderabadతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మళ్ళీ మరో అగ్నిపరీక్ష ఎదురవబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా బిజెపికి చెందిన సుమారు 300 మంది అతిరధ మహారధుల వంటి నేతలు తెలంగాణలో జరుగబోయే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రాబోతున్నారు.

మూడు రోజులపాటు సాగే ఈ సమావేశాలు హైదరాబాద్‌లోని నోవా టెల్ హోటల్లో నిర్వహించాలని బిజెపి అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు అవసరమైన ఏర్పాట్ల గురించి చర్చించేందుకు బిజెపి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి బీఎల్ సంతోష్ త్వరలో హైదరాబాద్‌ రాబోతున్నారు.

ఈ సమావేశాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రులు, బిజెపి ముఖ్యనేతలందరూ మూడు రోజులు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో టిఆర్ఎస్‌ పార్టీని ఓడించి బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు ఇప్పటికే చాలాసార్లు నొక్కి చెప్పారు. కనుకనే కీలకమైన ఈ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకొన్నట్లు చెప్పవచ్చు.

ఇదివరకు ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయిన సిఎం కేసీఆర్‌, హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో బిజెపి చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి కేంద్రంపై కత్తులు నూరుతున్న సంగతి అందరికీ తెలుసు. సిఎం కేసీఆర్‌ ఈ మద్యకాలంలో ఢిల్లీ వెళ్ళినా ప్రధాని, కేంద్రమంత్రులను కలవడం లేదు. వారు రాష్ట్రానికి వచ్చినప్పుడు మొహం చాటేస్తున్నారు. కనుక ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు, బిజెపి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ పార్టీ ముఖ్యనేతలు అందరూ హైదరాబాద్‌ వచ్చి మూడు రోజులు నగరంలోనే బస చేసి తన ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు తట్టుకోవడం కష్టమే. కనుక ఇందుకు ప్రతిగా ఈసారి సిఎం కేసీఆర్‌ వారు హైదరాబాద్‌ వచ్చే సమయానికి ఢిల్లీకి చేరుకొని అక్కడ ప్రతిపక్షాలను కూడగట్టి కేంద్రాన్ని విమర్శిస్తారేమో?