TJS Kodandaramతెలంగాణ ఉద్యమ కాలంలో రాజకీయమంతా ప్రొఫెసర్ కోదండరామ్ చుట్టూనే తిరిగేది. తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా ఆయన పోషించిన పాత్ర తెలంగాణ ఉద్యమంలో కీలకమైనది. అప్పట్లో ఎవరైనా ఆయనను ఒక మాట అంటే ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తెరాస వారంతా ఒంటి కాలి మీద లేచే వారు. వాక్చాతుర్యం తో తిట్లను కలిపి ఇది మా తెలంగాణ స్టైల్ అంటూ విరుచుకుపడేవారు. ఆ తరువాతి కాలంలో తెలంగాణ సిద్దించి ఉద్యమకారులు అధికారంలోకి వచ్చారు.

అప్పటికే తెరాసలో ఉన్న వారితో పాటు కొంత మంది ఉద్యమ ప్రముఖులు అధికారంలోకి వచ్చారు. అయితే కోదండరామ్ కేసీఆర్ ఇచ్చిన ఆఫర్లకు నో చెప్పడంతో కేసీఆర్ ఆయనను పక్కన పెట్టేశారు. మొదట్లో కొంత మొహమాటపడినా కోదండరామ్ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడల్లా తెరాస వారు ఘాటుగానే సమాధానం చెప్పడం తొందరగానే మొదలుపెట్టేశారు. ఆ తరువాత కోదండరామ్ కు కులం అంటగట్టి తెలంగాణ ద్రోహిను చేసేశారు కూడా.

ఒకప్పుడు కోదండరామ్ ను ఎవరైనా ఏమన్నా అంటే వెయ్యి తునకలు చేస్తా అని బెదిరించిన కేసీఆర్ కూడా ఆయన ను తన దైన శైలిలో మాటలు అనడంతో తెరాస ఆయన పాత్రకు ఏ మాత్రం గౌరవం ఇచ్చిందో తేలిపోయింది. తదనంతర పరిస్థితులలో కోదండరామ్ కాంగ్రెస్ వైపుకు చేరి మహాకూటమిలో తాను సొంతగా పెట్టిన పార్టీతో సహా కలిశారు. అయితే రాజకీయ ఆకాంక్ష కలిగిన కోదండరామ్ పార్టీని మాత్రం నిర్మించుకోలేకపోయారు. ముందస్తు ఎన్నికలు రావడంతో ఆ పార్టీకి గుర్తు కూడా చివరి నిమిషంలోనే కేటాయింపబడింది.

ఈ క్రమంలో ఆయన పార్టీకు ఇచ్చే సీట్లు తెరాసకు రాసిచ్చేసినట్టే గ్రహించిన కాంగ్రెస్ కూడా ఆయనను చివరి వరకు మాటలలో పెట్టి చివరికి అరకొర సీట్లు కేటాయించింది. కనీసం ఆయన కోరుకున్న జనగామ సీటు కూడా ఇవ్వలేదు. కోదండరామ్ వైపు నుండి చూస్తే ఆయన తెలంగాణ సాధనకు చేసిన పాత్రకు ఇది అవమానమే. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంతకంటే మార్గం లేదు కానీ మేము అధికారంలోకి వస్తే ఆయనకు సముచిత గౌరవం ఇస్తాం అంటుంది. కోదండరామ్ ను గౌరవించే తెలంగాణ ప్రజానీకం ఈ మాట నమ్మి మహాకూటమి వైపు వస్తారా అనేది చూడాలి. కోదండరామ్ ను అవమానించింది కాంగ్రెస్ అంటూ తెరాస ప్రచారం చెయ్యడం ఖాయం. కాకపోతే ఆ హక్కు వారికి ఉందా అనేది ప్రజలు ఆలోచిస్తారు.