Asaduddin_Owaisi_KCRతెలంగాణలో బిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీల మద్య దోస్తీ గురించి అందరికీ తెలిసిందే. బహుశః ఆ కారణంగానే మజ్లీస్‌ పార్టీ ఇంతకాలం పాతబస్తీకే పరిమితమైపోయిందని చెప్పవచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో 50 స్థానాలలో పోటీ చేయబోతోందనే వార్త తెలంగాణ రాజకీయాలలో కలకలం రేపుతోంది. మరోపక్క మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చే ఎన్నికల తర్వాత 15 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో అడుగుపెడతామని ప్రకటించడంతో “బిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీల మద్య చెడిందా?” అంటూ మీడియాలో విశ్లేషణలు మొదలయ్యాయి.

వాటిపై మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “మజ్లీస్‌ పార్టీ 50 స్థానాలలో పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. కేసీఆర్‌ బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడం మంచిదే. ఆయన తాజ్ మహల్ కంటే అందమైన సచివాలయం నిర్మించారు. దాని ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం కనుక ఆహ్వానిస్తే తప్పక వెళ్తాము. ఆ రోజు సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగబోయే బిఆర్ఎస్‌ సభకి రమ్మనమని మాకు ఆహ్వానం రాలేదు. అది బిఆర్ఎస్‌ సభ కనుక దాంతో మాకు ఎటువంటి సంబందమూ లేదు” అని అన్నారు.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మజ్లీస్‌ పార్టీ ఏడుగురు శాసనసభ్యులకే పరిమితం అవుతోంది. కనుక శాసనసభలో తన బలం పెంచుకోవాలనుకోరుకోవడం సహజమే. కానీ దాని వలన బిఆర్ఎస్‌కి నష్టం కలుగుతుంది. రాష్ట్రంలో బిఆర్ఎస్‌కి ఎదురే ఉండకూడదని కేసీఆర్‌ టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలని బలహీనపరిచి రాజకీయంగా దెబ్బ తీశారు. వాటి స్థానంలో ప్రవేశించిన బిజెపి రాష్ట్రంలో తన పార్టీకి, ప్రభుత్వానికి, అధికారానికి సవాలు విసురుతుండటంతో, కేసీఆర్‌ టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చుకొని ఏకంగా జాతీయస్థాయిలోనే బిజెపిని దెబ్బతీసేందుకు సిద్దమవుతున్నారు.

కనుక ఒకవేళ మజ్లీస్‌ నిజంగానే 50 స్థానాలకి పోటీ చేయదలిస్తే, కేసీఆర్‌ దానిని తమ శత్రువుగా పరిగణించి అణచివేయడానికి సంకోచించరనే విషయం కేసీఆర్‌తో అంటకాగుతున్న ఓవైసీలకి తెలియదనుకోలేము. కానీ కేసీఆర్‌కి తాము గులాములు కామని తెలియజేప్పేందుకే బహుశః మీడియాకి ఇటువంటి లీకులు ఇచ్చి ఉండవచ్చు. మజ్లీస్‌ పార్టీకి తెలంగాణలో 50 స్థానాలలో పోటీ చేసేందుకు అభ్యర్దులే లేరనే విషయం కేసీఆర్‌కి కూడా తెలుసు. కనుక ఇదంతా ప్రత్యర్ధులని ఏమార్చేందుకు మజ్లీస్‌-బిఆర్ఎస్‌ కలిసి ఆడుతున్న రాజకీయ ఆటగానే భావించవచ్చు.