KCR-Asaduddin Owaisiతెలంగాణలో బిఆర్ఎస్‌, మజ్లీస్ పార్టీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. ఆ దోస్తీ దెబ్బతినకుండా నిలుపుకోవడంకోసం మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఆగ్రహం రాకుండా సిఎం కేసీఆర్‌ చాలా జాగ్రత్త పడుతుంటారు. గత 8 ఏళ్లుగా వారి దోస్తీ బాగానే సాగింది నేటికీ సాగుతూనే ఉంది కూడా.

మజ్లీస్‌ పార్టీ పాతబస్తీకే పరిమితం కావాలని కేసీఆర్‌, ఓవైసీల మద్య రహస్య ఒప్పందం ఏమైనా జరిగిందో లేదో తెలీదు కానీ ఇంతకాలం పాతబస్తీకే పరిమితమైంది. కానీ సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నప్పుడు, తాము మాత్రం పాతబస్తీకే ఎందుకు పరిమితం కావాలని మజ్లీస్ అధినేత అనుకోవడం సహజమే. తాము కూడా తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని స్థానాలలో పోటీ చేసి తమ బలం పెంచుకొని రాష్ట్రంలో అధికారం చేపట్టాలని కోరుకోవడం సహజమే.

మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మొన్న మీడియాతో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల తర్వాత మేము 15 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో అడుగుపెడతాము,” అని చెప్పడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ తర్వాత ఆయన శాసనసభలో మిత్రపక్షమని కూడా చూడకుండా ‘కేసీఆర్‌, మంత్రులు శాసనసభలో బాగానే కబుర్లు చెపుతారు కానీ ఒక్క పని కూడా చేయరంటూ,” కడిగేశారు.

దీంతో బిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీల మద్య దూరం పెరిగిందని భావించి కాంగ్రెస్‌ నేతలు మజ్లీస్ నేతలని దువ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు మజ్లీస్‌కు 50 సీట్లు కేటాయించాలని అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్‌ని కోరారని, కానీ అందుకు ఆయన నిరాకరించడంతో బిఆర్ఎస్‌కి మజ్లీస్‌కి మద్య దూరం పెరిగిందని, అందుకే అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో కేసీఆర్‌, మంత్రులపై విమర్శలు చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.

మజ్లీస్‌ పార్టీ సర్వే చేయించుకోగా పాతబస్తీలో కాకుండా తెలంగాణలో వివిద జిల్లాలలో మరో 8 స్థానాలలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలున్నట్లు తేలింది. అందుకే 15 మంది శాసనసభ్యులతో సభలో అడుగుపెడతామని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పి ఉండవచ్చు.

కానీ ఇది కూడా రాష్ట్రంలో బిజెపిని నిలువరించడానికి కేసీఆర్‌ పన్నిన వ్యూహంలో భాగం అయ్యుండవచ్చు. జాతీయస్థాయిలో బిఆర్ఎస్‌ విస్తరించాలంటే దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింల మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్‌ మజ్లీస్‌ సహాయసహకారాలు చాలా అవసరం. కనుక అందుకు ప్రతిగా రాష్ట్రంలో మరో 8 స్థానాలలో మజ్లీస్‌కు ఇచ్చేందుకు కేసీఆర్‌ అంగీకరించి ఉండవచ్చు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఎలాగూ గెలవలేదు కనుక దానితో కలిసినా ప్రయోజనం ఉండదు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు అవసరమైనా మజ్లీస్‌ మద్దతు ఈయదు. ఎట్టి పరిస్థితులలో మజ్లీస్‌ తమ వెంట నడవక తప్పదని కేసీఆర్‌కి తెలుసు కనుకనే మరో 8 సీట్లు మజ్లీస్‌కు కేటాయించి ఉండవచ్చు. ఓవైసీ, కేసీఆర్‌ మద్య ఒప్పందంలో భాగంగానే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. కనుక ఇప్పుడు ఆలోచించుకోవలసింది బిఆర్ఎస్‌ కాదు బిజెపియే!