KCR and TRS happy with election comission deleting truck symbolకేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలోని అధికార పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితికి తీపి కబురు అందించింది. తెరాస పార్టీ గుర్తు కారును పోలి ఉన్న ట్రక్కును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ట్రక్కు, ఇస్రీపెట్టె గుర్తులను ప్రీ సింబల్స్‌ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన ట్రక్కు గుర్తు కారణంగా పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు అయ్యాయని తెరాస ఆరోపిస్తుంది.

ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి కాబట్టి సరిపోయింది లేకపోతే దీని వల్ల భారీ నష్టం జరిగేది అని పార్టీ ఆరోపించింది. సత్తుపల్లి, ధర్మపురి నియోజకవర్గల్లో ఓట్లు తక్కువ రావడానికి ట్రక్కు గుర్తే కారణమని కేసీఆర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇకపై ట్రక్కు గుర్తును ఎవ్వరికీ కేటాయించమని ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సమితికు పెద్ద ఊరట కలిగించే అంశం. ఈసీ నిర్ణయంపై తెరాస నేతలు హర్షం వ్యక్తం చేశారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో 16కు 16 సీట్లు సాధించి (మరో సీటు మిత్రపక్షం ఎంఐఎం) కేంద్రంలో చక్రం తిప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. ఈ నిర్ణయం ఆ దిశగా ఎంతో ఉపయోగపడుతుంది. తొందరలో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. మంత్రివర్గంలో కేటీఆర్, హరీష్ రావులకు చోటు ఇవ్వకపోవడంతో ఎన్నికల ప్రచారంలో వారిని కూడా విరివిగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. వారు కూడా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చెయ్యబోతున్నారు.