TRS-KCR-Telanganaనలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై భూమి బ్రద్దలైపోతోంది… ప్రళయం ముంచుకొచ్చేస్తోందన్నట్లు నాలుగు రోజులుగా మీడియా వర్ణించేసింది. గత బుదవారం ఈ వ్యవహారం బయటపడగానే మర్నాడు కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడతారని, టిఆర్ఎస్‌ నేతలు మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఢిల్లీలోనే ప్రెస్‌మీట్‌ పెట్టి కడిగేస్తారని లీకులు ఇచ్చారు. కానీ కేసీఆర్‌ ఆ రెండూ చేయలేదు. దాంతో ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని బంగారిగడ్డలో బహిరంగసభలో సిఎం కేసీఆర్‌ ప్రళయ గర్జన చేసేస్తారన్నట్లు మీడియా తీర్మానించేసింది. నిజానికి టిఆర్ఎస్‌ కంటే ఈ విషయంలో మీడియాయే అత్యుత్సాహం ప్రదర్శించిందని చెప్పకతప్పదు.

కానీ సిఎం కేసీఆర్‌ మాత్రం ఎప్పటిలాగే దేశంలో పుష్కలంగా వనరులున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ వాటిని సమర్ధంగా వినియోగించుకొని దేశాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారని, ఆయనో అసమర్దుడంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, తన అద్భుతమైన పాలన, తన ప్రభుత్వ గొప్పదనం గురించి మాట్లాడారు. మునుగోడులో బిజెపికి ఓట్లువేస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని అదే టిఆర్ఎస్‌కు వేస్తే మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విదాల అభివృద్ధి చేసి చూపుతానని అందుకు తానే పూచీ అంటూ కొన్ని హామీలు, వరాలు ప్రకటించారు.

బిజెపి ఇవ్వజూపిన వందల కోట్లను నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఎడమకాలితో తన్నేసి తెలంగాణ సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పిన గొప్ప హీరోలని కేసీఆర్‌ వారిని ప్రశంశించారు… కానీ అదీ మొక్కుబడిగానే! తన ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, అందుకోసం వచ్చినవారు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది గనుక దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని కేసీఆర్‌ తేల్చి చెప్పేశారు.

కనుక మునుగోడు ప్రజలు బాగా ఆలోచించుకొని (టిఆర్ఎస్‌ పార్టీకే) ఓట్లు వేయాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మోడీని గద్దె దించేందుకు బయలుదేరుతున్న తనను ఆశీర్వదించాలని, ఈ అవకాశం మునుగోడు ప్రజలకే దక్కిందని దానిని అందరూ సద్వినియోగించుకోవాలని అన్నారు.

ఓటుకి నోటు కేసులో రేవంత్‌ రెడ్డి దొరికిపోయినప్పుడు చాలా హడావుడి చేసిన కేసీఆర్‌, ఈ వ్యవహారంపై ఇంత ఆచితూచి మాట్లాడటం కాస్త ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. బహుశః ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను అంత సులువుగా వేసేయలేనని గ్రహించినందువల్ల కావచ్చు లేదా ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెడితే మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోవడమే అవుతుందని భావించి వెనక్కు తగ్గి ఉండవచ్చు.

ఇక ఈ వ్యవహారాన్ని మునుగోడు ఉపఎన్నికలలో కూడా పూర్తిగా ఉపయోగించుకోలేకపోతుండటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలు ఈ వ్యవహారం కంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిలువరించడంపైనే ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. ఉపఎన్నికలలో డబ్బు పంచేందుకు ఆయనకు చెందిన సుశీ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ నుంచి రూ.5.24 కోట్లు మునుగోడులో కొందరి బ్యాంక్ ఖాతాలకు బదిలీ అయ్యిందంటూ ఈసీకి ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనం. కారణాలు ఏవైతేనేమి టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నుంచి టిఆర్ఎస్‌ ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నట్లు కనిపిస్తోంది.