KCR allegations on Narendra Modi Government2018 ఎన్నికల అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ ను కాసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగంలో పలుమార్లు జాతీయ స్థాయిలో వృద్దిరేటు తగ్గిన తీరు, ఆర్దిక మాంద్యం గురించి ప్రస్తావించారు. ఇది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పరోక్షం గా విమర్శించినట్లుగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే కాలంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ యాక్టీవ్ గా ఉంటుంది.

కేంద్ర మద్దతు ఉండటంతో బీజేపీ బలపడే అవకాశాలు ఉన్నయని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి అనుకూల ఫలితాలు రావడంతో కేసీఆర్ ఫోకస్ అటుపెట్టినట్టుగా ఉంది. తన ప్రసంగంలో తెలంగాణకు వచ్చిన ప్రతీ వ్యతిరేక ఫలితానికి కేంద్రాన్నే నిందించే ప్రయత్నం చేసారు ఆయన. వాహనాల మార్కెట్ దెబ్బతిందని, దాంతో కార్ల పరిశ్రమలు ఉత్పత్తిని కొన్ని కంపెనీలు నిలుపుదల చేశాయని అన్నారు. ఫలితంగా వాహనాల రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని, వేలాది మంది ఆయా రంగాలలో ఉపాధి కోల్పోయారని ముఖ్యమంత్రి వెల్లడించారు. బొగ్గు గనులలో కూడా ఉత్పత్తి తగ్గించవలసి వచ్చిందని ఆయన అన్నారు.

ఇదంతా జాతీయ స్థాయిలో జరిగిన పరిణామాలని, ఈ ఆర్దిక మాంద్యం ప్రభావం తెలంగాణపై కూడా పడిందని కెసిఆర్ పేర్కొన్నారు. కేంద్ర ఆదాయంలో వృద్ది రేటు బాగా తగ్గిందని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా పదిహేను శాతం ఆదాయం పెరుగుతుందని అనుకుంటే ఐదు శాతం మాత్రమే పెరిగిందని ఆయన అన్నారు. గత ఆర్దిక సంవత్సరం 13 శాతం పన్నులలో వృద్ది ఉంటే,ఈ ఏడాది ఆరు శాతం మాత్రమే ఉందని ఆయన అన్నారు. స్టాంప్, రిజిస్ట్రేషన్ లలో నాలుగుశాతం వృద్ది రేటు ఆశించిందానికన్నా తగ్గిందని ఆయన అన్నారు.

వాహనాల రిజిస్ట్రేషన్ లో మైనస్ వృద్ది రేటు ఉందని ఆయన అన్నారు.పన్నేతర శాతం 29 శాతం తగ్గిందని, ఇదంతా ఆర్దిక మాంద్యం ప్రభావమనేనని ఆయన అన్నారు. కేంద్రం పన్నుల వాటలో కోత పెట్టిందని, 4.5 శాతం కోత పెట్టారని ఆయన అన్నారు. మరికొన్ని రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా ఉందని కెసిఆర్ అన్నారు. వాటితో పోల్చితే తెలంగాణ పరిస్థితి గుడ్డిలో మెల్ల అని చెప్పాలి. కేంద్రాన్ని నిందిస్తూనే తెలంగాణాలో తమ ప్రభుత్వం వల్ల పరిస్థితి కాస్త బెటర్ గానే ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్.