Kaushal Army Paid Armyసక్సెస్ ఫుల్ రియాల్టీ షో బిగ్‌బాస్‌పై ఆరోపణలు చుట్టుముట్టిన తరుణంలో సీజన్‌ 2 విజేత కౌశల్‌ స్పందించారు. ఈ కార్యక్రమం అనైతికంగా ఉందని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులపై ఇద్దరు యువతులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో త్వరలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కూడా పుకార్లు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌశల్‌ బిగ్‌బాస్‌ గురించి ట్విటర్‌ వేదికగా స్పందించారు.

“బిగ్‌బాస్‌ 2 విజేతగా, ఓ సామాన్య పౌరుడిగా నాకు ఈ కార్యక్రమంపై ఎంతో గౌరవం ఉంది. ఈ కార్యక్రమం, ఎంపిక చేసే ప్రక్రియ ఎంతో నిజాయతీగా ఉంటాయని నాకు తెలుసు. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొనబోయే వారందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. మీరు రైడ్‌ ఎక్కబోతున్నారు” అని పేర్కొన్నారు. మరోవైపు నిన్న బిగ్ బాస్ పై ఉన్న కేసుల విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. బిగ్ బాస్ నిర్వాహకులకు ప్రస్తుతానికి ఊరటనిచ్చింది. వారిని తాము చెప్పే వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

నిర్వాహకులుపై నమోదైన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను, పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు బిగ్‌బాస్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనితో వారు ఊపిరిపీల్చుకున్నారు. మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వాయిదా పడే అవకాశం లేకపోతే ఈ షో ఈ నెల 21న ప్రారంభం అవుతుంది.