kattappa performance in baahubali 2‘బాహుబలి 2’ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ… తాను దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలోకల్లా ‘బాహుబలి 2’ ది బెస్ట్ గా కితాబిచ్చుకున్నాడు. సాధారణంగా తన సినిమాలలో హీరో పాత్రే హైలైట్ గా నిలుస్తుందని, కానీ ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఒక గుర్తింపు ఉంటుందని, అలాగే ప్రతి పాత్రకు ఒక క్యారెక్టర్ ఉంటుందని, అందుకే ఈ సినిమా తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే జక్కన్న దర్శకత్వం వహించిన గత సినిమాలతో, ‘బాహుబలి 1’ని పోల్చి చూసిన ప్రేక్షకులకు ఈ వ్యాఖ్యలపై నమ్మకం కలగలేదు.

కానీ, సినిమా విడుదలైన తర్వాత రాజమౌళి వ్యాఖ్యలు అక్షర సత్యమయ్యాయి. సినిమాలో దాదాపుగా ప్రతి పాత్రకు గుర్తింపు ఇవ్వడంతో పాటు, ఒక్కో పాత్రకు ఒక్కో విధానంతో అలరించాడు. సినిమాలో బాహుబలి, భల్లాలదేవుడు, పాత్రల తర్వాత కట్టప్ప పాత్రను జక్కన్న బాగా డిజైన్ చేసారు. రాజాజ్ఞకు కట్టుబానిసగా వ్యవహరించే కట్టప్ప పాత్రను అద్భుతంగా డిజైన్ చేసారని చెప్పవచ్చు. బాహుబలిని తానే చంపానని కధ మొత్తం చెప్పడం దగ్గర నుండి చివరికి భల్లాలదేవుడుపైనే తిరుగుబాటు చేసేటంత వరకు ఎక్కడా రాజు ఆజ్ఞ తప్పకుండా చూసుకున్నారు.

అలాగే చివర్లో క్లైమాక్స్ లో కూడా బిజ్జలదేవుడు, భల్లాలదేవుడు కట్టప్పను ‘కుక్క’గా అభివర్ణిస్తూ… రాజాజ్ఞను శిరసా వహించాలని, ఇలా తమపై దండెత్తి పూర్వీకులు ఇచ్చిన మాటను దాటవద్దని హితవు చెప్పే ప్రయత్నంలో అదిరిపోయే డైలాగ్ లతో ఆకట్టుకున్నాడు కట్టప్ప. నాడు చిన్నతనంలోనే శివగామిదేవి మహేంద్ర బాహుబలిని మహారాజుగా నియమించారని, మీ మాటలు వినాల్సిన అవసరం లేదు, తానేప్పటికీ మహారాజుకు కట్టు బానిసనేనని చెప్పిన డైలాగ్స్ ధియేటర్లో కేక పుట్టిస్తున్నాయి.