Kathi Mahesh Harassed by Pawan Kalyan Fansకేవలం ఓ విశ్లేషకుడిగా మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు జవాబుగా పవన్ కళ్యాణ్ పై తన అభిప్రాయం వ్యక్తం చేసిన మహేష్ కత్తి ప్రస్తుతం పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. బహుశా ఇలాంటి పరిస్థితి మరో వ్యక్తికి వస్తుందో లేదో కూడా తెలియదు గానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ‘మానవత్వం’ అనేది మరిచిపోయి మరీ విరుచుకు పడుతున్నట్లుగా కనపడుతోంది. తాను పవన్ కళ్యాణ్ అభిమానులపై ఎందుకు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నానో అంటూ కత్తి ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేయగా, అది చూసిన వారు మహేష్ పై జాలి పడకుండా ఉండలేరు.

కేవలం ఒకటి రెండు రోజుల్లో దాదాపుగా ఆరేడు వేల ఫోన్ కాల్స్… వాట్సప్ గ్రూప్ లలో దాదాపుగా పది వేల కొత్త నెంబర్ల నుండి బెదిరిస్తూ సందేశాలు… ఇలా వీటన్నింటిని చూపిస్తూ ఓ వీడియోను రూపొందించి తన పరిస్థితిని అర్ధం చేసుకోవాల్సిందిగా కోరారు. నిజమే… సెకన్ కో ఫోన్ రావడం ఈ వీడియోలో నిజంగానే కనపడింది. ఫోన్ రింగ్ అవ్వగానే మహేష్ కత్తి కట్ చేయడం, మరో కొత్త నెంబర్ నుండి మరుక్షణమే కాల్ రావడం ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. అసలు పవన్ అభిమానులు తనను ఏమంటున్నారో అని చెప్పడానికి కొన్ని కాల్స్ కు ఆన్సర్ ఇవ్వగా, అసభ్యకరమైన రీతిలో పవన్ ఫ్యాన్స్ వ్యాఖ్యలు చేయడం… ఇది సింపుల్ గా మహేష్ కత్తి ఆవేదన.

మ్యాటర్ ఇక్కడ కట్ చేసి… ఒక్కసారి రాంగోపాల్ వర్మ దగ్గరికి వస్తే… మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యల కంటే కొన్ని వందల రెట్లు స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై గానీ, ఆయన ఫ్యాన్స్ పై గానీ వర్మ విమర్శలు చేసి ఉంటారు. తాజాగా కూడా ఆ పరంపరను “అర్జున్ రెడ్డి” సినిమా ద్వారా ఫేస్ బుక్ లో కొనసాగిస్తున్నారు కూడా! ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన తర్వాత తెలంగాణాలో ఇంకా పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఉంటారా? అంటూ అభిమానులపై ఓ ఆట ఆడుకుంటున్నారు. అయినప్పటికీ వర్మకు ధీటైన జవాబు చెప్పడంలో పవన్ ఫ్యాన్స్ ది ఎప్పుడూ వెనుకడుగే!

ఎవరి దగ్గర అయినా పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోగలరు గానీ, వర్మ దగ్గరకు వచ్చేపాటికి మాత్రం ఎప్పుడూ వర్మదే పైచేయి అవుతోంది. నాడు ట్విట్టర్ వేదికగా అదే జరిగింది, ప్రస్తుతం ఫేస్ బుక్ లో కూడా ఆ పరిస్థితిలో మార్పు లేదు. దీన్ని బట్టి చూస్తే… పవన్ కళ్యాణ్ అభిమానులను ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్న విషయంపై వర్మ దగ్గర మహేష్ కత్తి కోచింగ్ తీసుకోవడం ఉత్తమమేమో అంటున్నారు నెటిజన్లు. అంటే వర్మ ప్రయాణించే రూట్ లో కాకుండా రాంగ్ రూట్ లో వెళ్ళడం వలనే మహేష్ కత్తికి ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న మాట.

ఒక్కసారి తన అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత డిఫెన్స్ లో పడకూడదు. తొలుత వెబ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్తున్న కత్తి, పవన్ ఫ్యాన్స్ పెడుతున్న ఇబ్బందులను బహిరంగం చేయడమే వారికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లయ్యింది. దీంతో వారు మరింతగా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారని చెప్పవచ్చు. ఎంత తమ హీరో మీద అభిమానం ఉన్నా గానీ, ‘అభిమానం’ పేరుతో ‘అరాచకత్వం’ ప్రదర్శించడం ఏ హీరో అభిమానులకైనా తగదని అందరూ గుర్తించాలి. బహుశా ఇదంతా తెలిస్తే… ఓ మానవతావాదిగా పవన్ కళ్యాణ్ కూడా దీనిని ఆహ్వానించే పరిస్థితి ఉండకపోవచ్చు.