Katamarayudu-ticket-pricsతమ అభిమాన హీరో సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలన్న ఆతృతతో, ఒక్క టిక్కెట్ కోసం అభిమానులు ఎన్ని పాట్లు పడతారో ఏదొక సందర్భంలో ప్రతి ఒక్కరం చూసే ఉంటాం. చివరికి రేటు కూడా అడగకుండా ఎంత అంటే అంత ఇచ్చేసి, టికెట్ దొరికితే చాలనుకుని పండగ చేసుకునే అభిమానులకు కొదవుండదు. అదీ పవన్ కళ్యాణ్ సినిమా అయితే… ఆ రేంజే వేరు. ఎక్కువ యూత్ ఫాలోయింగ్ ఉండడంతో, సినిమా టికెట్ ను ఎంత ధర పెట్టయినా చూడడానికి వెనుకాడరు.

సరిగ్గా ఇదే విషయాన్ని పవన్ ‘కాటమరాయుడు’ చిత్ర నిర్మాణ సంస్థ ‘క్యాష్’ చేసుకుంటోందని ఆల్ ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్ మండిపడింది. ఈ సినిమా టికెట్ల ధరను పెంచడాన్ని ఖండిస్తూ, వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరాలన్న ఆశ, మొదటి మూడు రోజుల్లో 30 కోట్లు సంపాదించాలన్న లక్ష్యాలతో, కేవలం పది రూపాయల టికెట్ ను 50 రూపాయలు చేసి సామాన్యుడికి వినోద భారాన్ని మోపుతున్నారని చేశారని విమర్శల వర్షం కురిపించింది.

అలాగే 50 టికెట్ ను 200గా, 150 టికెట్ ను 500కు పెంచి లూటీకి పాల్పడుతున్నారని, ఈ టికెట్ల పెంపుపై కోర్టును ఆశ్రయించామని, పవన్ కల్యాణ్ ది లూటీ చేసే సిద్ధాంతమని సంఘం సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తూ, పవన్ తన పబ్బం గడుపుకుంటున్నారని, బెనిఫిట్ షోల పేరు చెప్పి ఒక్కో టికెట్ ను 5 వేల వరకూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని, దీనిపై ఖచ్చితంగా పోరాడతామని స్పష్టం చేశారు.