Katamarayudu Theatrical Trailerఇటీవల కాలంలో సైలెంట్ గా ఓ పెద్ద సినిమా విడుదల అవుతోంది అంటే… అది ఖచ్చితంగా “కాటమరాయుడు” అనే చెప్పాలి. గత రెండు, మూడు సంవత్సరాలుగా టాలీవుడ్ లో పెరిగిన పబ్లిసిటీ రీత్యా… ఏ చిన్న సినిమా విడుదల అవుతోన్నా… అది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా పబ్లిసిటీని పీక్స్ లో చేస్తున్నారు. ఇక పెద్ద సినిమాలకైతే చెప్పనవసరం లేదు. పెద్ద సినిమాలకుండే బడ్జెట్ రీత్యా… ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చెలరేగిపోతుండగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ మాత్రం ఏం సౌండ్ చేయడం లేదు.

శనివారం నాడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతోన్నా మెగా అభిమానుల హంగామా పెద్దగా కనపడడం లేదు. విడుదలైన ఆడియోకు పెద్దగా స్పందన లేదు, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ విడుదల కానున్న ధియేటిరికల్ ట్రైలర్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి లేకుండా పోయింది. దీంతో అసలు పవన్ కళ్యాణ్ సినిమానేనా విడుదలవుతోంది? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పవన్ సినిమా అంటే… ఆ హంగామానే వేరు! కానీ, ఈ డబ్బింగ్ సినిమాకు ఆ రేంజ్ లేకపోవడం గమనించదగ్గ విషయమే.

వీటన్నింటికి తోడు అజిత్ నటించిన “వీరమ్” సినిమా డబ్బింగ్ రూపంలో ఇప్పటికే తెలుగులో ఆన్ లైన్ లో అందుబాటులో ఉండడం, దీనికి ప్రేక్షకుల నుండి పెద్దగా స్పందన లేకపోవడం ‘కాటమరాయుడు’కు అతి పెద్ద మైనస్ గా కనపడుతోంది. మరి తెలుగులో ఏమైనా మార్పులు, చేర్పులు చేసారేమో గానీ, తమిళ డబ్బింగ్ సినిమాను తెలుగులో చూసిన వారికి, పవన్ ఈ సినిమాను ఎందుకు ఎంపిక చేసుకున్నారా? అన్న సందేహం కలుగక మానదు. ఇలా ఏ యాంగిల్ లో చూసిన ‘కాటమరాయుడు’పై బజ్ పెద్దగా లేదు.

అయితే ఒక్కోసారి హైప్ తక్కువ ఉండడం కూడా సినిమాకు దోహదం చేస్తుంది. భారీ అంచనాలు పెట్టుకుంటే, ఆ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడం సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ హైప్ తక్కువతో విడుదలయ్యే సినిమాలు, ఏ మాత్రం యావరేజ్ గా ఉన్నా, బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంటాయి. మరి పవన్ “కాటమరాయుడు” ప్రేక్షకులకు ఏ యాంగిల్ చూపిస్తాడో తెలియాలంటే మార్చి 24వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.