Katamarayudu Movie Tickets Ratesతమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా… అని ఎదురుచూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఆ సమయం రానే వచ్చింది. దీంతో పరుగులెడుతూ ధియేటర్ల దగ్గరికి వెళ్లి చూస్తే… షాక్ తగులుతోంది. గవర్నమెంటు వారి ఉత్తర్వుల ప్రకారం టికెట్ రేట్లు పెంచబడినవి గనుక బాల్కనీ 150, బెంచి 100, నేల 50 రూపాయలు. ‘కాటమరాయుడు’ చిత్రాన్ని తిలకించేందుకు నేడు ఉదయం థియేటర్లకు వెళ్లిన అభిమానులకు కనిపిస్తున్న బోర్డులు ఇవి.

వాస్తవానికి బాల్కనీ 80 నుంచి నేల 20 వరకూ టికెట్ ధరలు ఉంటాయి. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, కొత్త సినిమా వస్తే, ఈ ధరలను పెంచుకోవచ్చు. అయితే పెంచుకోమని చెప్పారన్న ఒకే ఒక్క మాటను పట్టుకుని, గరిష్ఠంగా 150 రూపాయలకు విక్రయించాల్సిన బాల్కనీ టికెట్లను 800 నుంచి 1000 వరకు థియేటర్ కౌంటర్లలోనే అమ్మకాలకు ఉంచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా అభిమానులు అధికంగా ఉన్న తణుకు, భీమవరం తదితర ప్రాంతాల్లో థియేటర్ యాజమాన్యాలు ఈ నిలువుదోపిడీ జరుగుతోందని అభిమానులు వాపోతున్నారు.

అయితే ‘కాటమరాయుడు’ను అందరి కంటే ముందు చూసేయాలని అంత రేటు పెట్టి కొనుక్కున్న వారికి కూడా తీవ్ర నిరాశే ఎదురయ్యింది. ఈ సినిమా బెనిఫిట్ షోల ప్రదర్శన కోసం అభిమానులు గంటల కొద్ది సమయం వేచిచూడక తప్పలేదు. హైదారాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో ప్రదర్శితం కావాల్సిన షో విషయమై, ‘బెన్ ఫిట్ షో లేదు’ అనే బోర్డులను పెట్టడంతో, వారంతా రోడ్డు పైకి చేరి నిరసన తెలియజేయడంతో, ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

మరో పక్కన ఆయా థియేటర్ల యాజమాన్యం మాత్రం… ఈ సినిమా బెన్ ఫిట్ షో వేసేందుకు తమకు అనుమతులు లభించలేదని, అందువల్లే ప్రదర్శించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణాలో చాలా ప్రదేశాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా నిరసన తెలియజేస్తున్న పవన్ ఫ్యాన్స్ ను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం తమ హీరోను అనుకరిస్తూ పంచెకట్టు, టీ షర్టులు, చిలకపచ్చరంగులో ఉండే చిన్న టవల్ ను మెడపై వేసుకుని ధియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు.