Katamarayudu- movie postponeమరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” సినిమాను ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చరిత్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ‘సర్ధార్’ను కృష్ణాజిల్లాలో పంపిణీ చేసిన సంపత్ కుమార్ అనే డిస్ట్రిబ్యూటర్, తనకు 2 కోట్ల మేర నష్టం వచ్చిందని, దీనిని ‘కాటమరాయుడు’ హక్కుల ద్వారా భర్తీ చేయాల్సిందిగా నిర్మాత, పవన మేనేజర్ లను అడిగితే న్యాయం చేయట్లేదని, అందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని, ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం తర్వాత ‘సర్ధార్’ నైజాం డిస్ట్రిబ్యూటర్ కూడా ఇదే బాటలో నడిచాడు.

అయితే ‘కాటమరాయుడు’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ వార్తల్లోకెక్కారు. ‘కాటమరాయుడు’ హక్కులను తక్కువ ధరకు తనకు ఇస్తానని చెప్పి, ఇప్పుడు వేరెవరికో ఇచ్చి తనకు అన్యాయం చేసారని, ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించి, తనకు న్యాయం జరిగే వరకు తానూ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద నిరాహార దీక్ష చేస్తానని చెప్తూ… ఫిల్మ్ చాంబర్ ఎదుటే బైటాయించడంతో, ఈ పరిణామాలు మార్చి 24వ తేదీన ముహూర్తం పెట్టుకున్న ‘కాటమరాయుడు’ విడుదలకు ఆటంకం కలిగిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీక్షకు దిగిన సంపత్ కుమార్, కోర్టులకెక్కితే ‘కాటమరాయుడు’కు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చని, దాని కంటే ముందుగానే సదరు వివాదాన్ని ముగించుకోవడం మంచిదన్న భావన సినీ వర్గీయులు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి వివాదాలు ఇండస్ట్రీలో సర్వసాధారణమే అయినా, పవన్ కళ్యాణ్ వంటి హీరో సినిమాకు కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇలా బహిరంగమవ్వడం అభిమానులకు ఆందోళన కలిగించే అంశం. మరి ఈ వివాదంలో పవన్ తల దూరుస్తారో లేదో చూడాలి.