Kasturi-acted-for-both-DMK,-AIADMK,-Tamilnadu-electionsతమిళ రాజకీయాలు ఎప్పుడూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా మరోసారి అలాంటి చర్చలకే తెరలేపింది తాజా ఉదంతం. మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తమిళనాడులో రెండు ప్రధాన పార్టీల ప్రచారం మధ్య ఓ సీనియర్ తమిళ నటి ఇరుక్కుపోయారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ మీడియా ప్రచారం కోసం ఒకే నటితో ప్రచారం కల్పించడం వివాదాస్పదమైంది. 64 సంవత్సరాల కస్తూరి ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సహాయ నటిగా నటించి, గుర్తింపు పొందారు.

కస్తూరి వయసును దృష్టిలో ఉంచుకుని అధికారంలో ఉన్న జయలలిత అన్నాడీఎంకే ఓ ప్రకటన రూపొందించింది. “కన్నబిడ్డలే నాకు తిండి పెట్టలేదు. అన్నం పెట్టింది విప్లవ నాయిక అమ్మనే” అంటూ ‘అమ్మ క్యాంటీన్ల’ను చూపుతూ, ఈ ప్రచార చిత్రంలో నటించినందుకు 1500 ఇచ్చి పంపించారు. దీని తర్వాత డీఎంకే పార్టీ వారు సైతం వచ్చి తమ ప్రకటనలో నటించాలని కోరారు. ఆమె వారించినా వినకుండా తీసుకువెళ్లి “గాల్లో తిరిగే వారికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఎందుకు? చాలమ్మా” అంటూ చెప్పించి, ఓ 1000 చేతిలో పెట్టి పంపారు.

ఇప్పుడీ రెండు ప్రకటనలూ ఒకదాని తరువాత మరొకటి టీవీ చానళ్లలో పోటాపోటీగా ప్రసారమవుతున్నాయి. రెండు ప్రకటనల్లో నటించిన కస్తూరి మాత్రం, తనకే పాపం తెలియదని, తొలుత జయలలిత యాడ్ లో నటించిన తనను బలవంతంగా తీసుకెళ్లి రెండో యాడ్ తీశారని ఆరోపించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ రెండు యాడ్లనూ కలిపి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ఇప్పుడవి దేశవ్యాప్తంగా వైరల్ అవుతూ, తమిళ రాజకీయాలపై కామెంట్లు పడేలా చేస్తున్నాయి.