karun-nair-triple-century-smash-india-declare-england-test-seriesచెన్నై చెపాక్ స్టేడియంలో టీమిండియా ఆల్ టైం రికార్డులు సృష్టించింది. గత రికార్డులను బద్దలు కొడుతూ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులను నమోదు చేసింది. అంతకు ముందు శ్రీలంక మీద 2009లో ముంబైలో నెలకొల్పిన 726/9 రికార్డును తుడిచిపెడుతూ… చెన్నైలో 759/7 స్కోర్ ను నమోదు చేసి, 700 పరుగులు మైలురాయిని నాలుగవ సారి దాటింది. అయితే ఇంతటి భారీ స్కోర్ వెనుక కారణానికి “ఒక్కడున్నాడు.”

ఆడుతున్నది మూడవ టెస్ట్ మ్యాచ్ అయినప్పటికీ నింపాదిగా ఆడుతూ టెస్ట్ మ్యాచ్ మజా ఏంటో ఎంజాయ్ చేస్తూ అవలీలగా 300 పరుగుల మైలురాయిని అందుకున్నాడు కరుణ్ నాయర్. ఈ ఏడాది ఐపీఎల్ లో, రంజీ ట్రోఫీలలో భీకర ఫాంను ప్రదర్శించిన నాయర్ ను టీంలోకి తీసుకున్న సెలక్టర్లకు తన ప్రతిభ ఏంటో చూపించాడు. ఓవర్ నైట్ 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆరంభించిన నాయర్, నాలుగవ రోజు ఒక్కడే మరో 231 పరుగులు సాధించి, ఏకంగా ట్రిపుల్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు.

సెంచరీ అయ్యేటంత వరకు స్లోగా బ్యాటింగ్ చేసిన నాయర్, ఆ తర్వాత అదును దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. మరో ఎండ్ నుండి అశ్విన్ (67), జడేజా (51) పరుగులు చేసి చక్కని సహకారం అందివ్వడంతో… చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా 250 పరుగుల మైలురాయిని చేరుకున్న తర్వాత సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి వేగంగా 290 మార్క్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత కాస్త నెమ్మదించినప్పటికీ, విజయవంతంగా ట్రిపుల్ సెంచరీని పూర్తి చేయగలిగాడు. టెస్ట్ ల్లో సాధించిన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా నమోదు చేయడం విశేషం.

అయితే కరుణ్ ట్రిపుల్ వెనుక కెప్టెన్ విరాట్ కోహ్లి సమయస్పూర్తి కూడా ఉందని చెప్పాలి. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న కరుణ్ కు కావల్సినంత సమయం ఇచ్చి, పెవిలియన్ లో నాయర్ కు కొండంత అండగా నిలిచాడు. నిజానికి కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ వ్యక్తిగతంగా నాయర్ కు ఎంతటి ఆనందాన్ని కలిగించిందో ఏమో గానీ, కెప్టెన్ గా పెవిలియన్ లో ఉన్న విరాట్ కోహ్లి మాత్రం సంబరపడిపోయాడని చెప్పాలి. గత టెస్ట్ మ్యాచ్ లో తను సాధించిన 235 పరుగుల సమయంలో కూడా ఇంతలా సంతోషాన్ని వ్యక్తపరచలేదు.

300 పరుగులకు చేరువ కావడం ఎప్పుడూ జరిగే విషయం కాకపోవడంతో, డిక్లరేషన్ ను లేట్ చేసినప్పటికీ, విరాట్ కోహ్లి పై ప్రశంసల జల్లు కురిసాయి. నాయర్ ట్రిపుల్ సెంచరీ తో ఏకంగా 282 పరుగుల భారీ ఆధిక్యం టీమిండియా సొంతమైంది. చివరి రోజున ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేయగలిగితే టీమిండియా విజయం తధ్యం… అందరూ ఆశించిన విధంగా ఘనంగా 4-0తో ముగించిన వారవుతారు, లేని పక్షంలో 3-0తో జయకేతనం ఎగురవేయడం ఖాయం.