మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన “రాజా విక్రమార్క” సినిమా టైటిల్ తో నేడు కార్తికేయ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘గ్రిప్పింగ్ అండ్ ఎంటర్ టైన్మెంట్’గా కట్ చేసిన థియేటిరికల్ ట్రైలర్ తో ఈ సినిమా ఆసక్తిని పెంచగా, విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన మరొక విధంగా ఉండడం చిత్ర యూనిట్ కు రుచించని అంశం.

స్పై థ్రిల్లర్ జోనర్ కు కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పించాలన్న డైరెక్టర్ శ్రీ శ్రీపల్లి ప్రయత్నం మంచిదే గానీ, అది వెండితెరపై వినోదాత్మకంగా మలచడంలో విఫలమైందనేది సినీ విమర్శకుల టాక్. యాక్షన్ సన్నివేశాలను బాగానే తెరకెక్కించినప్పటికీ, కామెడీ పండించడం బెడిసి కొట్టడమే ఈ సినిమాకు ప్రధాన నెగటివ్ పాయింట్ గా మారింది.

“ఆర్ఎక్స్ 100” సూపర్ హిట్ తర్వాత ‘హిప్పీ, గుణ 369, 90ఎంఎల్, చావు కబురు చల్లగా’ వంటి సినిమాలతో వరుసగా బిజీ అయినప్పటికీ, ఏ ఒక్కటీ కూడా కార్తికేయకు సక్సెస్ అనుభూతులను పంచలేకపోయాయి. దీంతో రిలీజ్ కు ముందు వచ్చిన పాజిటివ్ బజ్ తో ‘రాజా విక్రమార్క’ విజయంపై బోలెడు ఆశలు పెట్టుకున్న కార్తికేయకు ‘సక్సెస్’ అందని ద్రాక్ష పండు కానుందా?