mahesh-karthiచిన్ననాటి నుండే వెండితెరపై సందడి చేసిన ప్రిన్స్ మహేష్ బాబు బాల్యం అంతా చెన్నైలో సాగిన విషయం అభిమానులకు తెలిసిందే. అలా టాలీవుడ్ ప్రిన్స్ తో పాటు తమిళ హీరో కార్తీ కూడా ఒకే స్కూల్ లో చదువుకున్నారు. సెక్షన్లు, గ్రూప్ లు వేర్వేరు గానీ, ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుకున్న సంగతులను తాజాగా కార్తీ నెమరువేసుకున్నారు. “కాష్మోరా” ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు కార్తీ.

ఇద్దరం ఒకే స్కూల్ లో చదువుకున్నప్పటికీ, పెద్దగా పరిచయం లేదని, ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ ప్రవీణ్ ద్వారా ‘హాయ్’ అంటే ‘హాయ్’ అంతేనని, అప్పుడు మహేష్ ది ఫియట్ కారు, నాది ఫియట్ కారు, పక్కపక్కనే పార్క్ చేసి ఉండేవని తెలిపాడు కార్తీ. అయితే ఇప్పుడు చూస్తున్న మహేష్ కు, అప్పుడు చూస్తున్న మహేష్ కు సంబంధం లేదని, అప్పట్లో మహేష్ చాలా లావుగా ఉండేవాడని, ఆ తర్వాత లయోలా కాలేజీలో చేరిన తర్వాత మహేష్ ను చూసి ఆశ్చర్యపోయానని, బోట్ క్లబ్ లో ఎప్పుడూ పరిగెత్తేవాడని, చాలా కష్టపడ్డాడని కార్తీ చెప్పిన సంగతులు ప్రిన్స్ అభిమానులను అలరిస్తున్నాయి.

హీరో అయిన తర్వాత వచ్చిన సినిమాలు చూసి మహేష్ కు ఫ్యాన్ అయిపోయానని, ఏమోషన్స్ ను అద్భుతంగా పండించడంలో మహేష్ సిద్ధహస్తుడని ప్రశంసలు కురిపించాడు. స్కూల్ లో చూస్తున్నపుడు మహేష్ లో ఈ యాంగిల్ అసలు చూడలేదని, అయితే సినిమాలలో తను పెడుతున్న హార్డ్ వర్క్, సిన్సియారిటీ, పాషన్ నాకు బాగా ఇష్టమని అన్నాడు ఈ తమిళ హీరో.