karnataka pre-poll survey against bjpఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటక రాష్ట్రంలో ఈ సారి కూడా అధికారం కాంగ్రెస్ పార్టీదేనని, గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఆ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందని, మునుపటితో పోలిస్తే బీజేపీ మెరుగుపడుతుంది గానీ, అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని, జేడీ (ఎస్) మాత్రం మరింతగా బలహీనపడుతుందని తాజా సర్వే వెల్లడించింది.

సీ-ఫోర్ సంస్థ ఈ నెల 1-25 తేదీల మధ్య చేపట్టిన ఈ సర్వేలో కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గాను 154 నియోజకవర్గాల్లో దాదాపు 22,357 మంది ఓటర్లను సర్వే సంస్థ పలకరించి వారి మనోగతం తెలుసుకుంది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 119 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేశామని, ఆ పార్టీకి రెండు సీట్లు అదనంగా అంటే 122 సీట్లు వచ్చాయని సీ-ఫోర్ తెలిపింది.

ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీకి 126 సీట్లు వస్తాయని, గతంలో 40 సీట్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈ సారి 70 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని, గతంలో 40 సీట్లను సాధించిన జేడీ(ఎస్) మాత్రం ఈ సారి 27 సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది. సర్వేలో పాల్గొన్న ఓటర్లు ఎక్కువగా తాగునీటి సమస్యనే ప్రధానంగా ప్రస్తావించారని సీ-ఫోర్ తెలిపింది.

మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే మళ్లీ సీఎం కావాలని దాదాపు 45 శాతం మంది కోరుకుంటున్నారని సీ-ఫోర్ వెల్లడించింది. సీఎంగా బీజేపీకి చెందిన బీఎస్ యడ్యూరప్పకు 26 శాతం మంది, జేడీ(ఎస్) హెచ్‌డీ కుమారస్వామికి 13 శాతం మంది అనుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోడీ మ్యాజిక్ దక్షిణాదిలో పనిచేయదని ఈ సర్వే చెప్తోంది.