Siddaramaiah-dk-shivakumarకర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 135 సీట్లు గెలుచుకొని భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అధికారంలో ఉన్న బిజెపిని ఓడించడం సామాన్యమైన విషయమేమీ కాదు. పైగా కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా పరాజయాలే తప్ప ఒక్క ఎన్నికలోను విజయం సాధించలేకపోతుండటంతో కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు తమ విజయంగా భావించి పండుగ చేసుకొంటున్నాయి.

అయితే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న సిద్దరామయ్య, డికె శివకుమార్ ఆ ఆనందాన్ని ఆవిరి చేసేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో తమ నాయకుడిని ఎన్నుకొనేందుకు సమావేశమయ్యారు. కానీ ఇరు వర్గాలు ముఖ్యమంత్రి పదవికి పట్టుబట్టడంతో ఎవరినీ ఎన్నుకోకుండానే సమావేశం ముగిసింది. శాసనసభాపక్ష నాయకుడు (ముఖ్యమంత్రి)ని ఎన్నుకొనే బాధ్యత కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఓ ఏకవాఖ్య తీర్మానం ఆమోదించారు.

నిన్న జరిగిన సీఎల్‌పీ సమావేశానికి కాంగ్రెస్‌ అధిష్టానం తరపున పరిశీలకులుగా హాజరైన కాంగ్రెస్‌ పెద్దలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి కాంగ్రెస్‌ అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారు. ఈలోగా సిద్దరామయ్య, డికె శివకుమార్ ఇద్దరూ సోనియా, రాహుల్ గాంధీలను కలిసేందుకు సోమవారం ఢిల్లీకి బయలుదేరుతున్నారు.

ఇద్దరిలో ఎవరూ వెనక్కు తగ్గకపోవడం వలన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో పండగ వాతావరణం నెలకొనవలసిన ఈ సమయంలో చాలా గంభీరమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఒకవేళ శివకుమార్‌కు ఈసారి ముఖ్యమంత్రి పదవి లభించకపోతే ఆయన తీవ్ర అసంతృప్తి చెందటం ఖాయం.

ఈ ఎన్నికలలో 66 సీట్లు గెలుచుకొని రెండో స్థానంలో నిలిచిన బిజెపి ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తోందనే సంగతి కాంగ్రెస్‌ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. ఒకవేళ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా, మహారాష్ట్రలో శివసేనపార్టీలో ఏక్‌నాథ్‌ షిండేని ప్రోత్సహించి, ఆ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా కూల్చివేసి అధికారం చేజిక్కించుకొన్నట్లే, కర్ణాటకలో కూడా శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి బిజెపి వెనకాడదు. కనుక కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఇంకా ప్రమాదం పొంచి ఉందనే చెప్పొచ్చు.

కనుక కాంగ్రెస్ పార్టీ వీలైనంత త్వరగా, సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించవలసి ఉంటుంది లేకుంటే కాంగ్రెస్‌ను చీల్చి బిజెపి అధికారంలోకి దక్కించుకొంటే, రాబోయే రోజుల్లో జరిగే ఏ రాష్ట్రంలో, ఏ ఎన్నికలలో కూడా ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి ఓటేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే… కాంగ్రెస్‌కు మరణశాసనంగా మారుతుంది కనుక కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు, కాంగ్రెస్‌ అధిష్టానం తెలివిగా, చురుకుగా వ్యవహరించవలసి ఉంటుంది.