karen shivaji says pawan kalyan Janasena party will shut down పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను చిరంజీవి స్వాగతిస్తే.. పవన్‌ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారన్నారు.

ప్రజా మద్దతు లేని పార్టీ జనసేన అని, త్వరలో జనసేన పార్టీ మూతపడుతుందని కారెం శివాజీ జోస్యం చెప్పారు. చిరంజీవి మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్ధించిన నాటి నుండీ ఆయన భుజాల మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ ను కాల్చే ప్రయత్నం చేస్తారని జనసైనికులు అనుకునే ఉన్నారు.

దానికి తగినట్టుగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. రష్యాలోని తన అత్తవారి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఎల్లుండి విశాఖపట్నంలో మూడు రాజధానుల పై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఆ తరువాత ప్రభుత్వ ప్రకటనను బట్టి జనసేన తన భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇది ఇలా ఉండగా రాజధానికి భూకులు ఇచ్చిన రైతుల ఆందోళన ఎనిమిదో రోజుకు చేరింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రతీ రోజు వివిధ రీతుల్లో నిరసన తెలుపుతున్న రైతులు బుధవారం తాళ్లాయిపాలెం పుష్కరఘాట్ దగ్గర జలదీక్ష చేపట్టారు.