karan-joharపాకిస్థాన్ నటుల వివాదం ముదరడంతో సినీ పరిశ్రమ మొత్తాన్ని రంగంలోకి దింపిన కరణ్ జోహర్ పాక్ నటులకు మద్దతుగా మాట్లాడి, స్టార్ నటులతో వారి అనుకూల ప్రకటనలు చేసేలా ఇన్స్ ఫ్లుయెన్స్ చేశాడు. అయితే సల్మాన్, ఓం పురి, ప్రియాంకా చోప్రా వంటి నటులు మాట్లాడినా, రాజకీయ పార్టీలు, సినిమా థియేటర్ల యజమానులు మాత్రం దిగిరాలేదు. దీంతో అతని సినిమా విడుదలకు నోచుకోని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రకటించిన తేదీ ముంచుకొస్తోంది.

ఆ రోజు విడుదల కాని పక్షంలో తీవ్రంగా నష్టపోక తప్పదని అంచనా వేసి, రంగంలోకి దిగిన కరణ్ జోహర్ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో, ఉగ్రవాదాన్ని ఖండిస్తానని, మన సైన్యాన్ని గౌరవిస్తానని, తాను కూడా దేశభక్తుడినేనని తెలిపాడు. దేశభక్తిని ప్రదర్శించడానికి ఉత్తమ మార్గం ప్రేమను పంచడమేనని, అది తాను తన సినిమాల ద్వారా చేస్తున్నానని అన్నాడు. తాను ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా తీసేటప్పటికి ఇరు దేశాల సంబంధాలు బాగానే ఉండేవని, ప్రభుత్వం కూడా పాకిస్థాన్‌ తో స్నేహ సంబంధాల కోసమే ప్రయత్నించిందని అన్నాడు.

కానీ ఇప్పుడు సెంటిమెంట్లు వేరుగా ఉన్నాయని, వాటిని తాను గౌరవిస్తానని అన్నాడు. ఇక మీదట తాను పాకిస్థానీ నటీనటులతో సినిమాలు చేయబోనని అన్నాడు. తన సినిమాలో ఫవాద్ ఖాన్ తోపాటు సుమారు 300 మందికి పైగా భారతీయులు కూడా పనిచేశారని అన్నాడు. ఈ సినిమా కోసం వారంతా తమ రక్తం, చెమట ధారపోశారని, ఈ సినిమా విడుదలకు ఆటంకం కలిగించవద్దని సూచించాడు.