Kapu Reservationజరిగిన ఎటువంటి సంఘటన అయినా చివరకు పాజిటివ్, నెగటివ్ అనే రెండు సందేశాలను ఇస్తుంది. తుని వద్ద జరిగిన ఉదంతం కూడా అంతే! ఇప్పటివరకు జరిగిన విశ్లేషణలన్నీ నెగటివ్ యాంగిల్ లో వచ్చినవే. అయితే తుని సంఘటన జరగడం వలన ప్రజలకు, ముఖ్యంగా కాపు వర్గానికి ఒక నిజం తెలిసి వచ్చింది.

‘కాపు ఐక్యగర్జన’ ప్రధాన లక్ష్యమైన ‘కాపులను బీసీల్లోకి చేర్చడం’ అసాధ్యమన్న విషయం తేలిపోయింది. ఈ సంఘటన తర్వాత ప్రసంగించిన ప్రముఖ నాయకుల వాదన, నిపుణుల అభిప్రాయాలు, వివరణలను పరిశీలిస్తే ‘కాపులను బీసీల్లోకి చేర్చడమనేది…’ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినంత పని! బహుశా ఏపీకి ప్రత్యేక హోదా అయినా వస్తుందేమో గానీ, కాపులను బీసీల్లోకి చేర్చడం అసాధ్యమని నిపుణులు ఖచ్చితంగా చెప్తున్న అభిప్రాయం.

ఏపీకి “ప్రత్యేక హోదా” అనేది కేవలం రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి వుంది. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే, అడ్డుగోడలను తొలగించి స్పెషల్ స్టేటస్ ఇవ్వడమనేది అసాధ్యమేమీ కాదు. కానీ, కాపుల రిజర్వేషన్ రాజకీయాలకు అతీతమైన అంశంగా కనపడుతోంది. రాజ్యాంగ పరమైన చిక్కులతో పాటు, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ అంశంలో కీలకపాత్ర పోషించానున్నాయని స్పష్టం కావడంతో… ఇక ఈ అంశంపై ఆశలు పెట్టుకోవడం అత్యాశగానే భావించవచ్చు.

నిజానికి ‘కాపులను బీసీల్లోకి చేర్చడం’ అనేది ప్రజల్లో (ముఖ్యంగా కాపు వర్గాల్లో) బలంగా లేని అంశం. ఏదో కాలయాపన రాజకీయాల కోసం తప్ప, ప్రజలు దీనిపై స్వచ్చంధంగా ఉద్యమించింది లేదు, అలాగని రాజకీయ నాయకులకు పెద్దగా సహకారం అందించింది లేదు. పవన్ చెప్తున్నట్లు ఇది దశాబ్ధాల నాటి ఉన్న అంశమే కానీ, ఆనాటి నుండి పెద్దగా ప్రాధాన్యత లేని అంశం. అందుకే ఏళ్ళు గడిచినా ఆ సమస్య అలాగే ఉంది. తాజా పరిణామాలతో “ఇక అలాగే ఉంటుంది కూడా” అని ఫిక్సవ్వాలి! ముఖ్యంగా కాపులను బీసీల్లోకి చేరుస్తారని ఆశించే వారు..!