Kapu-Community-Kanna-Lakshminarayana-Bonda-Uma-Ganta-Srinivasa-Raoఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు ఈ నెల 26న విశాఖలో కాపునాడు బహిరంగసభ నిర్వహించబోతున్నారు. ఈ సభకి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఇటువంటి కులసభలు నిర్వహించి తమ సమైక్యశక్తిని చాటుకోవడం పరిపాటే. కానీ ఈసారి ఎన్నికలకి ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఇటువంటి సభలు మొదలవడం గమనిస్తే ఏపీలో ముందస్తు ఎన్నికలు రావచ్చని వారు కూడా గట్టిగా నమ్ముతున్నట్లు భావించవచ్చు.

ఈ సభకి ముందు టిడిపి, జనసేన, బిజెపిలలోని కాపు నేతలు భేటీ అవుతుండటం ఇంకా ఆసక్తికరంగా ఉంది. నిన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి గుంటూరులోని కన్నా లక్ష్మి నారాయణ ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. అంతకు కొన్ని రోజుల ముందు పవన్‌ కళ్యాణ్‌ మంగళగిరి పార్టీ కార్యాలయంలో కాపు, బీసీ సంఘాల నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికలలో బీసీల ఓట్లు చీలిపోకుండా అందరినీ కలిపేందుకు గట్టిగా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు.

నిన్న విజయవాడలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన గంటా శ్రీనివాసరావుని ఆయన నివాసంలో టిడిపి నేతలు బొండా ఉమా, ఎడం బాలాజీ, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. విజయవాడలో వంగవీటి రంగ వర్ధంతి నిర్వహించబోతున్న వంగవీటి రాధ కూడా త్వరలో వారందరితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

కనుక కాపునాడు సభకి ముందే ఏపీ రాజకీయాలలో ఈ కాపు నేతలలో కొందరు పార్టీలు మారే అవకాశం ఉందనిపిస్తోంది. వారి సమావేశాల వెనుక టిడిపి, జనసేనలు కృషి చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది కనుక ఈసారి రాష్ట్రంలో కాపులందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసేవిదంగా వ్యూహరచన జరుగుతున్నట్లు అర్దమవుతోంది. అయితే వేర్వేరు పార్టీలలో కాపు నేతలున్నట్లయితే కాపుల ఓట్లు ఆయా పార్టీల మద్య చీలడం కనుక. దీనిని ఏవిదంగా నివారించాలనుకొంటున్నారనేది చాలా ముఖ్యం. బహుశః కాపునాదు సభలోగా కొంత స్పష్టత వస్తుందేమో? ఒకవేళ కాపులు, బీసీలు సమైక్యమైతే వారు తప్పకుండా వచ్చే ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా నిలుస్తారు. ఆ శక్తి ఎవరి వైపు నిలుస్తుందో చూడాలి.