MP Kanumuru Raghu Rama Krishnam Raju complaints on YSRCP leadersనరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం సీరియస్ అయ్యేలా ఉంది. ఇరుపక్షాలు మీడియా ముందుకు వచ్చి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రఘురామ కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి రాసిన లేఖ వివాదాస్పదం అవుతుంది. జిల్లాలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు దిష్టిబొమ్మలు దహనం చేస్తూ తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

అలాగే వారి నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు తగిన భద్రత ఇవ్వాలని ఆయన కోరారు. గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడిగిన మాదిరి గానే రఘురామ కృష్ణంరాజు కూడా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు భద్రత కోరుతూ ఉత్తరం రాసే అవకాశం ఉందని తెలుస్తుంది.

కొందరు రాజకీయ విశ్లేషకులు… ఈ ఎంపీ జగన్ చేత సస్పెండ్ చేయించుకోవడానికి ఆరాటపడుతున్నారని, అదే జరిగితే సేఫ్ గా బీజేపీలో వెళ్లి చేరవచ్చని ఆయన వ్యూహం అని వారు అంటున్నారు. గతంలో జగన్ కేసుల విషయంలో ఇబ్బంది పడుతున్న సమయంలో రఘురామ కృష్ణం రాజు జగన్ కు అండగా నిలిచారు.

ఆ తరువాత ఆయనతో విభేదించి టీడీపీలో చేరారు. ఆ సమయంలో జగన్ మీద గట్టిగానే విమర్శలు చేశారు. అయితే 2019 ఎన్నికలకు కొద్ది ముందు మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి నరసాపురం పార్లమెంట్ కు పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మళ్ళీ జగన్ పార్టీకి కొరకరాని కొయ్యిగా మారారు.