Kanumuru Raghu Rama Krishnam Raju  Joining TDP.jpg2014 ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఆ పార్టీ సీట్ల డిమాండ్ తో బేజారెత్తి పోయింది. మొత్తానికి 15 అసెంబ్లీ సీట్లు, మూడు పార్లమెంట్ సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. అయితే అప్పటికి కాషాయ పార్టీలో ఆ సీట్లలో నిలబెట్టేందుకు కాండిడేట్లు కూడా లేరు దానితో టీడీపీనే కొందరిని ఆ పార్టీలో చేర్పించి టిక్కెట్లు ఇప్పించింది.

అలా వెళ్లిన కొంతమందికి టిక్కెట్లు రాలేదు. టిక్కెట్లు వచ్చిన వారు రాని వారు ఇప్పుడు పొత్తు విఫలం కావడంతో తిరిగి వెనక్కు వచ్చేస్తున్నారు. ఇటీవలే తిరుపతిలో నిర్వహించిన ధర్మపోరాట సభ సందర్భంగా అక్కడి భాజాపా నేత అప్పట్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి జయరాం.. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిన విషయం తెలిసిందే.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భాజపా నేత రఘురామ కృష్ణంరాజు పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించారు. ఈ సాయంత్రం పార్టీ కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి రానున్న రఘురామ కృష్ణంరాజు సీఎం సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ నుండి నరసాపురం ఎంపీ టిక్కెట్టు కోసం ఆయన అక్కడకి వెళ్లారు. అయితే ఆరెస్సెస్ ఒత్తిడితో ఆ సీటు గోకరాజు రంగరాజుకు ఇచ్చారు. పొత్తు విఫలం కావడంతో ఇక బీజేపీలో భవిష్యత్తు లేదని తిరిగి వచ్చేస్తున్నారు. తెదేపాలోకి భాజపా నుంచి మరిన్ని వలసలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.