YS Jagan - Kanumuru Raghu Rama Krishnam Rajuవైఎస్సార్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సిబిఐ దాడులు జరిగాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక థర్మల్ ప్రాజెక్టు కు బ్యాంకుల వద్ద 826 కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదు… నా పై ఎటువంటి దాడులు జరగలేదు అంటున్నారు ఆయన.

తాజాగా ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చి అధికారపక్షంపై విరుచుకుపడ్డారు. జగతి పబ్లికేషన్ (సాక్షి ప్రచురణ సంస్థ) కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. సీబీఐ దాడులంటూ తనపై దుష్ప్రచారం చేశారని, సాక్షి పత్రిక, టీవీపై పరువు నష్టం దావా వేస్తానని రఘురామ స్పష్టం చేశారు.

దీనిపై న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు… రఘురామ కృష్ణంరాజు టీటీడీ చైర్మన్, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చెయ్యడం గమనార్హం. వైవీ సుబ్బారెడ్డి అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాశానన్నారు. రంగుల విషయంలో న్యాయస్థానాలు సీఎం జగన్ గూబ పగులగొట్టాయన్నారు.

ఓట్లు కావాల్సినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావాలని.. గెలిచాక శిరోముండనాలు, దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏడుకొండలు.. ఏడు రెడ్లు అన్నట్లు తిరుమల తయారైందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీ ల మధ్య పొత్తు వార్తలు వస్తున్న తరుణంలో జగన్ కేసులలో పురోగతి ఉంటుందా అనేది చూడాలి.