Kanumuru Raghu Rama Krishna Raju - YS Jaganప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేస్తాను, యువతకు ఉపాధి కల్పిస్తాను అంటూ అధికారం చేపట్టక ముందు జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనలకు, అధికారం చేపట్టిన తర్వాత మూడు జనవరిలు వెళ్ళిపోయినా జాబ్ క్యాలెండర్ లు రిలీజ్ చేయకపోవడంతో జగన్ సర్కార్ పై ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

అయితే ఈ విషయాలను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఖండించారు. జాబ్ క్యాలెండరును మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేసారు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కల్లా ఓ వ్యక్తి మాత్రమే అందులో జాబ్ తెచ్చుకోగలిగారు, ఆ వ్యక్తి పేరే జ్ఞానేంద్ర రెడ్డి అంటూ తనదైన శైలిలో చెప్తూ… మా ముఖ్యమంత్రి జగన్ ను ఏమి అనవద్దని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలామంది ‘రెడ్ల’ను సలహాదారులుగా నియమించిందని, ఇపుడు కొత్తగా ఈ జ్ఞానేంద్ర రెడ్డి వచ్చారని, ఈయనకు ఏ పాటి జ్ఞానం ఉందో తనకు తెలియదని, విదేశీ – ప్రవాస భారతీయుల వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాదారునిగా నియమించారని, మరి ఈయన ఎవరికి సలహాలు ఇస్తారో చూడాలని అన్నారు.

ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న రెడ్ల సలహాదారులలో మా ముఖ్యమంత్రికి సలహా ఇవ్వగలిగే రెడ్డి ఒక్కరు మాత్రమేనని, ఆయనే ఏ శాఖకు మంత్రి కాకపోయినా, అన్ని శాఖల మంత్రిగా వ్యవహరించే సజ్జల రామకృష్ణా రెడ్డి అని, ఇంతమంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను సలహాదారులుగా నియమించి, వైసీపీ ప్రభుత్వం ప్రజాధనం వృధా చేస్తోందని దుయ్యబట్టారు.

పేరు చివరలో ‘రెడ్డి’ అని ఉండడమే పెద్ద క్వాలిఫికేషన్ అని, మీ పేరు సుబ్రహ్మణ్య చివర కూడా ‘రెడ్డి’ అని పెట్టుకుంటే, మీకు కూడా ఏ ‘మీడియా సలహాదారు’ పోస్ట్ వస్తుంది అంటూ ఎదురుగా ఉన్న మీడియా వ్యక్తితో చమత్కరించారు ఆర్ఆర్ఆర్.