kannada actress Upendra into politicsచూడబోతుంటే… సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోలంతా రాజకీయ పార్టీలు స్థాపించే ఊపులో ఉన్నట్లుగా కనపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ పవర్ స్టార్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగా, అతి త్వరలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇదే బాటలో పయనించనున్నారన్న సంకేతాలు స్పష్టంగా వచ్చేసాయి. తాజాగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర రాజకీయ రంగప్రవేశం చేస్తూ… ఓ నూతన పార్టీని ఏర్పాటు చేయనున్నారని అధికారికంగా ఖరారైంది.

13 నిమిషాల నిడివి గల ఆడియో సందేశాన్ని పంపిస్తూ… అవినీతి ర‌హిత రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేసారు. అలాగే తను ఎందుకు రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారో కూడా తెలిపారు. “మ‌న నాయ‌కుల‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు కావాల్సిన విద్యార్హ‌త‌లు లేకున్నా ప‌ర్లేదు కానీ, వారి నియోజ‌క‌ వర్గాలలో ఉన్న స‌మ‌స్య‌ల గురించి, వాటి ప‌రిష్కారాల గురించి క‌నీస అవ‌గాహ‌న ఉండాలని” పేర్కొన్నారు.

రాజ‌కీయ నేత‌ల‌కు త‌మ‌ నియోజ‌క‌వ‌ర్గం మీద ఉన్న అవ‌గాహ‌న ఆధారంగా వారికి ఒక ప‌రీక్ష పెట్టి త‌ర్వాతే టికెట్ ఇవ్వాల‌ని, రాజ‌కీయాల్లోకి డ‌బ్బు రావ‌డం వ‌ల్ల వ్య‌వ‌స్థ చెడిపోయింద‌ని, అలాంటి వారిని ప్రోత్స‌హించ‌కుండా, ప్ర‌జాక్షేమమే ధ్యేయంగా ప‌ని చేసే వారికి ప్రాధాన్య‌మివ్వాల‌ని సూచనలు చేసారు. అలా ప‌ని చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు మీ న‌మ్మ‌కం కావాలంటూ అభ్యర్ధించారు.

పార్టీ ఫండ్ అవసరం లేని రాజ‌కీయ పార్టీని నేను పెడ‌తాను. ఇత‌ర పార్టీల్లా నేను పెద్ద పెద్ద మీటింగులు పెట్ట‌ను. కేవ‌లం ప‌త్రిక‌లు, సోష‌ల్ మీడియా, టీవీ ఛాన‌ళ్ల ద్వారానే నా ప్ర‌చారం కొన‌సాగిస్తానని ఉపేంద్ర సెలవిచ్చారు. ఈ సాయంత్రం లోగా త‌న పార్టీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెల్లడిస్తానని చెప్పడంతో, ఏం చెప్పబోతున్నారా? అన్న ఆసక్తి పొలిటికల్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దక్షిణాదిలో స్టార్ హీరోల పొలిటికల్ పార్టీలు దేనికి సంకేతాలు ఇవ్వబోతున్నాయి.