kanna-lakshminarayana-says-ban-bigg-boss-telugu-season-3ప్రఖ్యాత టీవీ షో, బిగ్ బాస్ నిన్నటితో ప్రసారం ప్రారంభించింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా తన మొదటి ఎపిసోడ్ లో ఇరగదీశాడు. అయితే ఇప్పటివరకూ ఈ షో మీద వచ్చిన వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. చాలా మంది అసలు షో ప్రారంభం అవుతుందా అని కూడా అనుకున్నారు. ఈ షో మీద తెలంగాణ హైకోర్టు లో కేసులు పెండింగులో ఉన్నాయి. తాజాగా ఈ వివాదం రాజకీయ రంగు కూడా పులుముకుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ షోను బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. “బిగ్ బాస్-సీరీస్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ షో భారతీయ సంప్రదాయాలకు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించి యువతను పక్కదారి పట్టించేలా ఉంది.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ షో ప్రసారం కాకుండా పర్మిషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ఆయన ఇరు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేశారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే నాగార్జున ఎప్పటినుండో మోడీకి మద్ధతుదారుగా ఉన్నారు. అయినా నాగార్జున హోస్ట్ చేస్తున్న షోను బీజేపీ టార్గెట్ చెయ్యడం విశేషం. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. బీజేపీ నిజంగా ఈ విషయంలో సీరియస్ అయితే కేంద్ర సమాచార ప్రసార శాఖకు ఫిర్యాదు చేయాల్సింది. టీవీ కార్యక్రమాలు నియంత్రించే అవకాశం వారికే ఉంటుంది. అసలే సంస్కృతీ సంప్రదాయాలకు విఘాతం కలుగుతుందంటే అసలు ఊరుకోరు కూడా.