Kanna_Lakshminarayana_Resignation_BJP.jpgబిజెపి సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మినారాయణ గురువారం గుంటూరులో తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన తర్వాత బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు అనుచరులు కూడా బిజెపికి రామ్ రామ్ చెప్పబోతున్నారు. ఈ నెల 23,24 తేదీలలో ఆయన పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆయన జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో సమావేశమైనప్పుడే ఆ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఆవిప్పుడు నిజం కాబోతున్నాయి.

కన్నా లక్ష్మినారాయణ బిజెపిని వీడటానికి కారణం ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు వ్యవహారశైలే. ఆయన పార్టీలో తన వర్గాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నా లక్ష్మినారాయణ బహిరంగంగానే ఆరోపించారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించినవారిని చెప్పాపెట్టకుండా తొలగించడంపై కన్నా లక్ష్మినారాయణ, సోమూ వీర్రాజుపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయకపోగా మరింత బలహీనపరుస్తున్నారని, కనీసం మిత్రపక్షమైన జనసేనతో కలిసి పనిచేసేందుకు సోమూ వీర్రాజు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. సోమూ వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ రాష్ట్రంలో బిజెపిని ఓ దశాదిశా లేకుండా నడిపిస్తున్నారంటూ కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. అయితే బిజెపి అధిష్టానం తన సూచనలని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అది కూడా సోమూ వీర్రాజునే సమర్ధిస్తున్నట్లు భావిస్తున్నామని అన్నారు. కనుక బిజెపిని వీడుతున్నట్లు కన్నా లక్ష్మినారాయణ ఈరోజు ఉదయం ప్రకటించారు. త్వరలోనే తన భవిష్య కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

అయితే బిజెపిని వీడి బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేనలో చేరబోతుండటం ద్వారా కన్నా లక్ష్మినారాయణ జనసేనకి కొత్త సమస్య తెచ్చిపెట్టారని చెప్పవచ్చు. తమ పార్టీకి చెందిన నేతలని జనసేనలో చేర్చుకొంటే అది మిత్రద్రోహమే అని సోమూ వీర్రాజు ఇదివరకే హెచ్చరించారు. ఈ విషయం జనసేనకి కూడా బాగానే తెలుసు.

అయితే టిడిపితో పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఒకవేళ తమతో బిజెపి కలిసి రాకపోతే దానితో వదులుకొనేందుకు సిద్దపడుతున్నారు. ఇక సోమూ వీర్రాజు కూడా జనసేనతో పొత్తులు అవసరం లేదన్నట్లు మాట్లాడుతున్నారు.

కనుక కన్నా లక్ష్మినారాయణ చేరికతో బిజెపి, జనసేనల పొత్తులు పెటాకులు కాబోతున్నాయని భావించవచ్చు. ఒకవేళ అదే జరిగితే, త్వరలోనే టిడిపి-జనసేనల పొత్తులపై పూర్తి స్పష్టత వస్తుంది.

Kanna_Lakshminarayana_BJP_Resignation