Kanna Lakshminarayanaజగన్ ప్రభుత్వం పై బీజేపీ దాడి కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి మీదా, ప్రభుత్వం మీదా విమర్శలు చేస్తూనే ఉన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ… జగన్ 100 రోజుల పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ అలాగే ఉందని ఆయన ఆరోపించారు. ప్రజలు మంచి మార్పు కోరుకొని జగన్‌కు అవకాశం ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన ఆయన గత ఐదేళ్ల సంగతే మాట్లాడుతున్నారుగానీ, ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

నిర్మాణ కార్మికుల ఆకలి కేకలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ ఇసుక దొరకడం లేదు. ఆన్‌లైన్‌ విధానం పని చేయడంలేదు. ప్రజలను ఇబ్బందులు పెట్టడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది రివర్స్‌టెండరింగ్‌ పేరుతో రాష్ట్ర ఆర్థికవ్యవస్థను కుదేలు చేశారు. రాయలసీమలో తాగునీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతుంటే అక్కడి ప్రాజెక్టులను నింపడంపై దృష్టి పెట్టడం లేదు’’ అని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరు మార్చి గ్రామవాలంటీర్లను తీసుకొస్తున్నారని, అది కేవలం పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమే అని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగమైతే రాత పరీక్ష ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

ఇవన్నీ ప్రభుత్వంపై భారం పడే నిర్ణయాలు తప్ప మరొకటి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘మీరు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ఉపాధి హామీ క్రింద గత మూడు నెలల్లో 18 వందల కోట్లు కేంద్రం ఇచ్చింది. కానీ పాత బకాయిలు కూడా ఇంకా చెల్లించలేదు. వంద రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక్కటైనా చెప్పగలరా? 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే నిర్ణయం పారిశ్రామికీకరణకు అవరోధం. ఇది మీ అవగాహన రాహిత్యాన్ని బట్టబయలు చేస్తోంది.