Kanna Lakshminarayanaఏపీ బిజెపి సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మినారాయణ ఈనెల 16న పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజుతో విభేదించి ఆయన బిజెపిని వీడాలని నిర్ణయించుకొన్నప్పుడు మొదట జనసేనలో చేరాలని భావించి, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. అయితే జనసేన, బిజెపిల మద్య పొత్తులు ఉన్నందున ఆయనని పార్టీలో చేర్చుకొంటే బిజెపి అభ్యంతరం చెప్పడమేకాక, జనసేనతో తెగతెంపులు చేసుకొనే అవకాశం ఉంది.

కనుక కన్నా లక్ష్మినారాయణ తన అనుచరులతో చర్చించిన తర్వాత ఈనెల 23వ తేదీన టిడిపిలో చేరాలని నిర్ణయించుకొన్నారు. టిడిపి, బిజెపిల మద్య ఎటువంటి స్నేహం, పొత్తులు లేవు కనుక టిడిపిలో చేరితే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

కానీ రాబోయే శాసనసభ ఎన్నికలలో గుంటూరులో తాను సూచించిన అభ్యర్ధులకే ఇవ్వాలని, లేకుంటే తానే రంగంలో దిగాల్సివస్తుందని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇదివరకే టిడిపి అధిష్టానాన్ని హెచ్చరించారు. కనుక కన్నా లక్ష్మినారాయణ చేరికపై ఆయన ఏవిదంగా స్పందిస్తారో అని అందరూ ఎదురుచూస్తుంటే, ఆయన సానుకూలంగానే స్పందించడం విశేషం.

మొన్న గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, “కన్నా లక్ష్మినారాయణ ఏ పార్టీలో చేరుతారో ఇంకా తెలీదు కానీ టిడిపిలో చేరితే ఆయనతో కలిసి పనిచేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. గతంలో ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా ఆయన కలిసి పోటీచేశాము. కన్నా లక్ష్మినారాయణ టిడిపిలోకి వచ్చినా ఎవరి లెక్కలు వారికి ఉంటాయి కనుక ఆయనతో మాకు ఇబ్బందేమీ ఉండదని భావిస్తున్నాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఆయనకి అన్ని విదాల సహాయసహకారాలు అందిస్తాను,” అని రాయపాటి సాంబశివరావు అన్నారు. కనుక కన్నా లక్ష్మినారాయణ టిడిపిలో చేరిపోవడానికి లైన్ క్లియర్ అయిన్నట్లే భావించవచ్చు.

కన్నా లక్ష్మినారాయణ బిజెపిలో అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకొన్నప్పుడే తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఆయనని ఏపీలో బిఆర్ఎస్‌ పగ్గాలు చేపట్టవలసిందిగా రాయబారం పంపారని, కానీ అందుకు ఆయన నిరాకరించారని సమాచారం. ఒకవేళ ఆయన బిఆర్ఎస్‌లో చేరినా ఎన్నికలలో గెలవగలిగేవారేమో కానీ ఏపీలో బిఆర్ఎస్‌ని గెలిపించుకోవడం అసంభవమే. కనుక ఆయనకి రాజకీయంగా ఎదుగుదల ఉండేది కాదు. కానీ రాబోయే ఎన్నికలలో టిడిపి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నందున కన్నా లక్ష్మినారాయణ సరైన నిర్ణయమే తీసుకొన్నారని చెప్పవచ్చు.