Kanna_Lakshminarayana_Joined_TDPఏపీ బిజెపి సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ గుంటూరులో తన నివాసం వద్ద నుంచి గురువారం మధ్యాహ్నం సుమారు 3000 మంది అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి మంగళగిరి టిడిపి కార్యాలయానికి చేరుకొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకి పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌ బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్‌ నిజాముద్దీన్‌, తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌ తదితరులు కూడా టీడీపీలో చేరారు. బిజెపిలో కన్నా ముఖ్య అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు కన్నాతో పాటు నేడు టిడిపి కండువాలు కప్పుకొన్నారు.

దీంతో గుంటూరులో బిజెపి సగం ఖాళీ అయిపోగా, టిడిపి బలం ఆమేరకు పెరిగింది. కన్నా లక్ష్మినారాయణ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2004 నుంచి 2014 వరకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బిజెపి నుంచి మరికొంతమంది సీనియర్ నేతలు టిడిపిలోకి తీసుకువస్తానని కన్నా లక్ష్మినారాయణ చెపుతున్నారు. కనుక ఆయన చేరికతో టిడిపి మరింత బలపడిందనే చెప్పొచ్చు.

అయితే గుంటూరు తన అడ్డా అని భావిస్తున్న టిడిపి ఎంపీ రాయపాటి సాంభాశివరావు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకపోతే వచ్చే ఎన్నికలలో గుంటూరుని వైసీపీ టచ్ చేయలేదు. ఇక అమరావతి రైతులని దారుణంగా అవమానించి, రాజధానిని విశాఖకి తరలించడానికి ప్రయత్నిస్తున్నందున గుంటూరుతో పాటు కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల ప్రజలు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

అలాగే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తాహమని మభ్యపెడుతూ విశాఖ ఒక్కటే రాజధాని అనే విషయం బయటపెట్టినందుకు రాయలసీమ ప్రజలు సైతం వైసీపీపై ఆగ్రహంగానే ఉన్నారనే విషయం ఇదివరకు చంద్రబాబు నాయుడు పర్యటనలలో, ఇప్పుడు నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో స్పష్టంగా కనబడుతోంది. కనుక టిడిపికి అన్నీ శుభసూచకాలు కనిపిస్తున్నట్లే భావించవచ్చు.