ఏపీ బీజేపీ నేతల రక్తం మరిగిందట. ఇటీవలే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయానికి అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. తానా సభలకు వెళ్లిన జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అక్కడ ప్రసంగిస్తూ మోడీ భజన చెయ్యనారంభించారట. ఆంధ్రప్రదేశ్ కు ఇతోధికంగా సాయం చేస్తున్నాం అంటూ మోడీ బాకా ఊదుతుంటే అక్కడ వారు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. దీనితో రాంమాధవ్ తన స్పీచ్ ను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.
దీనిపై తానా సభలు టిడిపి భజన సభల్లా మారాయని అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ లో ధ్వజమెత్తారు. రాంమాధవ్ జాతీయవాద ప్రసంగానికి అడ్డు తగిలి అవమానించడం ద్వారా లోకేష్ గ్యాంగ్ తమ నీచబుద్దిని ప్రదర్శించిందని ఆయన పేర్కొన్నారు. పచ్చతమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువారి ప్రతిష్టను దిగజార్చుతున్నారని కన్నా వ్యాఖ్యానించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే తానా సభలకు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్లారు.
వారెవరూ రాజకీయాలు మాట్లాడకపోవడంతో ఎటువంటి ఇబ్బంది రాలేదు. మరి రాంమాధవ్ ఒక్కరికే ఈ ఇబ్బంది ఎందుకు వచ్చిందో అర్ధం కాని విషయం ఏమీ కాదు. ఆ విషయం అలా ఉంచితే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కన్నా గారు దానికి జాతీయవాదం అంటూ కలరింగ్ ఒకటి. ఒకవేళ కన్నా ఆరోపించినట్టు తానా వారంతా టీడీపీ వారే అయితే ఢిల్లీలో అధికారంలో ఉండి కూడా ఆ మాత్రం నిఘావర్గాల సమాచారం లేదా రాంమాధవ్ కు? ఇంతకూ బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం పై కన్నా ఇప్పటివరకూ ఏమైనా మాట్లాడారా?