ఆంధ్రప్రదేశ్ వేదికగా రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల హంగామా ఒక్క ఏపీలోనే కనపడుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా పది నెలల పైనే సమయం ఉన్నప్పటికీ, రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ వైసీపీ – బిజెపి – జనసేనలు అంతర్లీనంగా కుమ్మక్కై తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నట్లుగా క్లియర్ కట్ గా అర్ధమవుతోంది.
అధికారంలో ఉన్న టిడిపిని గద్దె దించే ఈ కార్యక్రమంలో భాగంగా… బిజెపి ఆధ్వర్యంలో వైసీపీ – జనసేనలకు సలహాలు, సంప్రదింపులు అందుతున్నాయని, అందులో భాగంగానే ఈ రెండు పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఒక్కసారిగా పవన్ పై జగన్ వ్యక్తిగతంగా విరుచుకుపడడం… కాపులను బీసీలలోకి చేర్చేది లేదని తేల్చిచెప్పడం… ఇందులో ప్రధాన అంశాలుగా పేర్కొంటున్నారు.
ఈ విధంగా కాపులను జనసేన వైపుకు మలిచేలా చేయడంలో జగన్ కర్తవ్యమని, అందుకే పవన్ కూడా తనపై వచ్చిన విమర్శలను లైట్ గా తీసుకున్నారనేది టిడిపి వర్గీయుల వాదన. అంతేగాక ప్రస్తుతం స్పెషల్ స్టేటస్ పై ఏపీలో భారీ స్థాయిలో చర్చ జరుగుతుండడంతో, దానిని డైవర్ట్ చేయడం కోసం పవన్ ను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోవడంతో, జగన్ చేత ఈ సంచలన వ్యాఖ్యలను బిజెపి పలికించిందనేది టిడిపి వాదన.
ఈ ఆపరేషన్ డైవర్షన్ లో పవన్ పూర్తిగా విఫలం కాగా, జగన్ కొంతమేరకు విజయం సాధించారని, అయినప్పటికీ టిడిపి ఢిల్లీ వేదికగా స్పెషల్ స్టేటస్ పై పోరాటం చేస్తోందని సమర్ధించుకుంటున్నారు. లాజిక్స్ తో కూడిన ఆరోపణలకు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సరిపోవడంతో, ఈ మూడు పార్టీల ‘మాస్టర్ ప్లాన్స్’ను తిప్పికొట్టే విధంగా టిడిపి వ్యూహరచన గావిస్తోంది. ఇదే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే, వచ్చే ఎన్నికలలో టిడిపి జయకేతనం కష్టం కాకపోవచ్చు.