Kanna Lakshmi Narayana warns YS Jaganఎన్నికల ముందు తమ ఒకప్పటి మిత్రుడు తాజా శత్రువు చంద్రబాబు నాయుడును ఓడించడానికి బీజేపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. అయితే ఎన్నికల తరువాత నెమ్మదిగా స్వరం మార్చుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య కేంద్రంలో పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఏమీ ఇవ్వకపోవడంతో తమ వైఖరి ఏంటో చెప్పకనే చెప్పేసింది. పైగా బీజేపీ రాష్ట్ర నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను విమర్శించడం కూడా మొదలెట్టేశారు.

తెలుగుదేశం పార్టీ చోటామోటా నాయకులను బీజేపీలో చేర్చుకునే సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వం మీద విమర్శలు చెయ్యడం గమనార్హం. జగన్ సర్కారు కూడా చంద్రబాబు సర్కారు లానే ప్రవర్తిస్తుందని, రాజకీయ ప్రత్యర్థుల మీద కక్షసాధింపుకు పాల్పడుతుందని కన్నా పదే పదే ప్రస్తావిస్తున్నారు. వైఖరి మార్చుకోకపోతే చంద్రబాబుకు పట్టిన గతే మీకు కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు కూడా. స్వల్పవ్యవధిలో వచ్చిన ఈ మార్పు గమనార్హం.

అయితే ఇక్కడ గుర్తించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల మీద కక్షసాధింపుకు పాల్పడితేనే వారు రక్షణ కోసం బీజేపీ పంచన చేరేది. కన్నా చేస్తున్న ఆరోపిణలు నిజమనుకుంటే ఒకరకంగా వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీకి మంచే చేస్తుంది. ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కేవలం ఒక్క సీటులో కూడా డిపాజిట్ దక్కించుకోలేని బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో బలీయమైన శక్తిగా అవతరించే ప్రయత్నం చేస్తుంది. అందుకు ఇప్పటి నుండే వేగంగా పావులు కదుపుతుంది.