Kanna Lakshmi Narayanaఎన్నికలు సమీపిస్తుండగా ఏపీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఇటీవలే జరిగిన పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకంలో ఆకుల కూడా రేస్ లో ఉండడం గమనార్హం. తన రాజీనామా లేఖలో కూడా ఆయన కన్నా లక్ష్మీనారాయణ మీద ఆరోపణలు చేసారు. కన్నా లక్ష్మీనారాయణకు, పార్టీ కేడర్‌కి అగాధం ఏర్పడిందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ఆయన తొందర్లో జనసేనలో చేరి ఆ పార్టీ తరపున రాజముండ్రి పార్లమెంట్ కు పోటీ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన ఆకుల సతీమణి జనసేనలో కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకానొక సమయంలో టీడీపీలో చేరాలని ఆయన భావించినా చంద్రబాబు స్పందించలేదు. ఇప్పటి వరకు బీజేపీకి ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో వైపు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

మరో ఎమ్మెల్యే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎప్పుడూ టీడీపీ పక్షపాతే అనే పేరు ఉంది. ఆయన పార్టీలో ఉంటారనే నమ్మకం ఆ పార్టీ వారికి ఎప్పటినుండో లేదు. ఇక మిగిలింది తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మాత్రమే. స్వతహా ఆరెస్సెస్ వాది కావడంతో ఆయన మాత్రమే పార్టీలో మిగిలి ఉండే అవకాశం ఉంది. అయితే ఆయన వచ్చే ఎన్నికలలో బీజేపీ నుండి పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదు. దీనితో ఆ పార్టీ భవిష్యత్తు అయోమయంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయకపోగా అన్నీ చేసేశాం అని ఆ పార్టీ తెలుగుదేశం పై ఎదురుదాడి చేస్తుంది. అయితే దీనిని ప్రజలు హర్షిస్తున్నట్టు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఏ పార్టీ కూడా ఆ పార్టీతో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. దీనిని ఆ పార్టీ హై కమాండ్ గుర్తించకపోయినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తిస్తున్నారు. దీనితో వారి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ హై కమాండ్ మేలుకుని ఈ విషయాన్ని గుర్తిస్తుందేమో చూడాలి. లేకపోతే ఈ సారి ఎక్కడా డిపాజిట్లు తెచ్చుకునే పరిస్థితి ఉండదు.