Kanna Lakshmi Narayanaనాలుకకి నరం లేదు అన్నట్టు సాగిపోతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆనాడు పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసి మేము అధికారంలోకి వచ్చాకా పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రగల్బాలు పలికి ఆ తరువాత ఎందుకు మాట మార్చారో చెప్పలేరు గానీ ఇప్పుడు ఏకంగా ఏపీలో ఓటు అడిగే హక్కు ఒక్క బీజేపీకే ఉందని అంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ.

నరేంద్రమోదీ పరిపాలన సువర్ణ అక్షరాలతో దేశ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు ఆయన. కేంద్రం ఇచ్చిన నిధులను దోచుకొని చంద్రబాబు, లోకేష్‌ దాచుకున్నారని విమర్శించారు. ఇదే మాటలు కన్నా మొన్నటివరకూ కాంగ్రెస్ లో కూడా ఉండి చెప్పారు. కేంద్రం నిధులు దోచుకుంటే కేంద్రం చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నట్టు? నిధులు ఇస్తే దోచుకునే అవకాశం ఉన్నప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు? ప్రత్యేక హోదాలో నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి మేలు చెయ్యవచ్చు కదా?

మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదని, ప్రధానిగా మోదీ ఉంటేనే దేశ భద్రత పటిష్ఠంగా ఉంటుందని కన్నా అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజమే చంద్రబాబు ఏ హామీ నెరవేర్చలేదు. ఆపదలో ఉన్న ప్రజలను బ్యాంకు ఖాతాలో ఒక్కొక్కరికి 15 లక్షలు వేసి ఆదుకున్నది నరేంద్ర నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కదా? మీరు చెప్పాలి మేము వినాలి కన్నా గారూ! అసలు కన్నా తో సహా బీజేపీ నాయకులు ఎవరైనా ఎన్నికలలో ఏపీ నుండి గెలిచే అవకాశం ఉందా? ప్రజలను మోసం చెయ్యడం తరువాత ఇప్పుడు తమని తాము మోసం చేసుకోవడం మొదలు పెట్టినట్టు ఉన్నారు.