Kanna Lakshmi Narayanaఆంధ్రప్రదేశ్ బీజేపీలో కలకలం మొదలయ్యింది. ఇద్దరు కీలక నేతలు పార్టీ నుండి కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఇప్పటికే పార్టీలోకి కొత్తగా వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ కోసం తన పార్టీ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆయనకు వచ్చే ఎన్నికలలో టిక్కెట్టు లేదని పార్టీ చెప్పిందా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. సిట్టింగు ఎంపీ ఉండగా మరో నేతను తెచ్చి పార్లమెంట్ ఇంచార్జి గా నియమించడమే దీనికి సంకేతం.

పార్టీ వచ్చే ఎన్నికలలో కాశి విశ్వనాథ రాజును ఇక్కడ నుండి నిలబెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆయనను విశాఖపట్నం లోకసభ సెగ్మెంట్ కన్వీనర్ గా నియమించింది. ఆయన కన్నా అనుచరుడని సమాచారం. ఈ క్రమంలో కంభంపాటి హరిబాబుని పొమ్మనలేక పొగబెడుతున్నారా అనే అనుమానం ఉంది. హరిబాబు అనుచరులు మాత్రం అవమానాలు భరించేకంటే తెలుగు దేశం పార్టీలోకి వెళ్ళిపోతే బెటర్ అని ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారట. పైగా పోటీకి కంభంపాటి హరిబాబు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటూ పార్టీ వర్గాలు పుకార్లు సృష్టిస్తున్నాయి.

మరోవైపు మరో సీనియర్ నేత శాసనసభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు కూడా పార్టీ మారే అవకాశం ఉందట. ఆయనకు టీడీపీ, వైకాపాల నుండి ఇప్పటికే ఆహ్వానం అందిందట. విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసి గెలిచిన ఆయన ఈసారి కూడా బీజేపీ నుండి పోటీ చేస్తే గెలవడం మాట అటుంచి డిపాజిట్ వస్తే గొప్ప అనేలా ఉంది ఆ పార్టీ పరిస్థితి. దీనితో ఆయనకూడా ఆలోచనలో పడ్డారు. ఈసారి పార్లమెంట్ కు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేదాని మీద కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు.