Kanna Lakshmi Narayana not contesting for elections 2019ఒకప్పుడు ఎన్నో ప్రగల్బాలు పలికి టీడీపీ – బీజేపీ మధ్య పొత్తు విచ్చిన్నం కావడానికి తమ వంతు పాత్ర పోషించిన రాష్ట్ర బీజేపీ నేతల అసలు ప్రతాపం బయటపడింది. మాజీ మంత్రి మాణిక్యాలరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీకి పోటీ చెయ్యడానికి వెనుకాడుతున్నారు. బీజేపీ ఏపీ లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 123చోట్ల అభ్యర్థులను ప్రకటించింది.

ఇందులో మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణల పేర్లు లేవు. వీరిద్దరూ లోక్ సభకు పోటీ చేసి మోడీ పేరు మీద గెలిచే అవకాశాలు ఉంటాయేమో అని ఆశ పెట్టుకున్నారట. కన్నా అయితే ఏదో విధంగా ఎంపీ అయిపోతే ఆంధ్రప్రదేశ్ కోటాలో కేంద్ర మంత్రి అయిపోవచ్చు అనే ఆశతో ఉన్నారట. కన్నా సొంత సీటు – గుంటూరు పశ్చిమ స్థానం నుంచి సినీనటి పసుపులేటి లతా మాధవికి టికెట్‌ ఇచ్చారు. గత సంవత్సరం బీజేపీలో చేరిన ఆమె ఎన్నికలలో పోటీ చెయ్యడం ఇదే మొదటి సారి.

ఒక వేళ అధిష్టానం కన్నా లోక్ సభకు పోటీ చెయ్యడానికి ఒప్పుకోకపోతే పెదకూరపాడు స్థానం ఖాళీగా ఉంచడంతో కన్నా అక్కడి నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి. 2014లో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణుకుమార్‌రాజుకు మరోసారి టిక్కెట్‌ వరించింది. ఆయన మంత్రి గంట శ్రీనివాసరావును ఢీకొట్టబోతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఎన్నికల బరినుంచి తప్పుకోవడంతో కైకలూరులోనూ ఎవ్వరినీ బరిలో దించలేదు.