Kanna Lakshmi Narayanaరాజధాని తరలింపుపై బీజేపీ నేతలు తలో మాట చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అమరావతినే కొనసాగించాలని కన్నా, సుజనా వంటి వారు అమరావతికి మద్దతు అంటుంటే జీవీఎల్ నరసింహా రావు, కిషన్ రెడ్డి వంటి వారు అది కేంద్రానికి సంబంధం లేని అంశం అంటూ జగన్ ప్రభుత్వం నిర్ణయానికి వంత పాడుతున్నారు.

ఈ క్రమంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం. స్టేక్ హోల్డర్స్ ఆమోదం లేకుండా ఇష్టం వచ్చినట్లు రాజధాని మార్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రాజధాని అంశంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు లేవని, తాము స్పష్టంగా ఉన్నామని చెప్పారు. రాజధాని వ్యవహారంపై బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు.

ఇదే సమయంలో రాజధాని అంశం కేంద్రానికి సంబంధంలేదు… ఏదైనా అడిగితే మాత్రం కేంద్రం సూచనలు, సలహాలు ఇస్తుందని చెప్పారు. రాజధాని ఎక్కడ పెట్టాలనేది మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, గతంలో పార్టీలన్నీ కలిసి అమరావతికి మద్దతిచ్చాయని తెలిపారు. రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేకపోతే బీజేపీ చెయ్యగలిగేది ఏముంది?

బీజేపీ రాష్ట్రంలో అనామక శక్తి… కేంద్రం జోక్యం చేసుకోకుండా ఆ పార్టీ ఇక్కడ చేసేది ఏమీ లేదు. మొన్న ఆ మధ్య తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె వివాదంలో కూడా బీజేపీ అలాగే బీరాలు పలికింది. అయితే కేంద్రం తప్పుకోగానే ఏమీ చెయ్యలేకపోయింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావొచ్చు. ఇంతకూ కన్నా అయోమయంలో ఉన్నారా? అయోమయానికి గురి చెయ్యడానికి ట్రై చేస్తున్నారా?