Kanna Lakshmi Narayana - comments on YS Jagan Governmentబీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు పలువురు భాజపా నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వానికి ఆత్రం , ఆవేశం ఎక్కువ.. కానీ పని తక్కువ అని ఆయన విమర్శించారు. రెండు రోజుల క్రితం తనను కలిసిన రాజధాని రైతులకు మద్దతుగా బీజేపీ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తుంది.

అమరావతి విషయంలో స్థానిక రైతులకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిని చేసిందని, తాను అప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉండి రాజధానికి మద్దతు పలికానని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్‌ కూడా పాదయాత్ర సందర్భంగా రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారని పేర్కొన్నారు. మాట ఇచ్చాక వెనక్కుపోబోమని చెప్పిన నేతలు.. ప్రస్తుతం అన్ని విషయాల్లోనూ వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు.

రాజధాని ప్రాంతంలో రైతులకు న్యాయం చేయాలని సీఎంకు లేఖ రాస్తే స్పందన లేదని విమర్శించారు. మరోవైపు మందడంలో ముఖ్యమంత్రి జగన్‌ కాన్వాయ్‌ ని రైతులు అడ్డుకోబోయారు. దీంతో ఒక్కసారిగా జగన్‌కు వ్యతిరేకంగా రాజధాని నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అదుపు చేశారు. కారులోంచే రైతులకు అభివాదం చేసుకుంటూ జగన్‌ సచివాలయానికి వెళ్లిపోయారు. అయితే బీజేపీ కార్యకర్తల కుట్ర అని అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.