Kandula-Durgesh-Gorantla-Buchaiah-Chowdaryటిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో వైసీపీ ప్రభంజనాన్ని కూడా తట్టుకొని గెలిచి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకొన్నారు.

గతంలో అంటే 2007లో కాంగ్రెస్‌ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన కందుల దుర్గేష్ ప్రసాద్, గత ఎన్నికలలో జనసేనలో చేరి పోటీ చేసి గోరంట్ల చేతిలో ఓడిపోయారు. కానీ కందుల ఏమాత్రం నిరాశ చెందకుండా అప్పటి నుంచి నియోజకవర్గంలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పార్టీని బలోపేతం చేసుకొంటున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకొన్నట్లు అర్దమవుతోంది.

అయితే ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొంటే గోరంట్లను కాదని కందులకు టికెట్ కేటాయించదని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అప్పుడు కందుల పరిస్థితి ఏమిటి?వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా?లేదా పవన్‌ కళ్యాణ్‌ మాటకు కట్టుబడి గోరంట్ల బుచ్చయ్యకు మద్దతు ఇచ్చి పోటీలో నుంచి పక్కకు తప్పుకొంటారా?

ఒకవేళ టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోకపోతే, గోరంట్ల, కందుల మద్య పోటీ అనివార్యం అవుతుంది. అప్పుడు ఓట్లు చీలిపోతే వైసీపీ లాభపడవచ్చు లేదా మునుపటిలాగే మళ్ళీ గోరంట్ల విజయం సాధించవచ్చు. ఒకవేళ ఈసారి రాజమండ్రి ప్రజలపై పవన్‌ కళ్యాణ్‌ ప్రభావం చూపగలిగితే జనసేన అభ్యర్ధిగా పోటీ చేసే కందుల దుర్గేష్ ప్రసాద్ విజయం సాధించవచ్చు. కనుక టిడిపి, జనసేనల మద్య పొత్తులు ఉంటాయా ఉండవా?అనేది గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కందుల దుర్గేష్ ప్రసాద్ భవితవ్యం ఆదారపడి ఉంటుంది.