kandhaa-kannada-film-shoot-in-single-takeనిముషాల పాటను చిత్రీకరించడానికి సాధారణంగా సినిమాలలో ఎన్ని షాట్లు వినియోగిస్తారు? హీరోల కళ్ళజోడు దగ్గర నుండి హీరోయిన్ నాభి సౌందర్యం చూపించే వరకు ఒక వంద షాట్స్ ఒక్క 5 నిముషాల పాటలోనే చూడవచ్చు. మరి 150 నిముషాల సినిమా నిడివిలో ఎన్ని షాట్స్ చిత్రీకరిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం. అయితే తాజాగా ‘సింగిల్ టేక్’లో పూర్తయిన 92 నిముషాల నిడివి గల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సాల్మన్ కే జార్జ్ అనే కన్నడ దర్శకుడు “కందా” సినిమా పేరుతో ఓ హర్రర్ మూవీని రూపొందించాడు. ఈ సినిమాకు కేవలం సింగిల్ టేక్ లో 92 నిముషాలలో పూర్తి చేసాడు. ఓ పాప చుట్టూ తిరిగే కధాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ ను బెంగుళూరులోని కేఆర్ పురంలో గల బెంగుళూరు మూవీస్ స్టూడియోలో చిత్రీకరించారు. టైటిల్స్ తో కలిపి 97 నిముషాల పాటు ఉండే ఈ సినిమాను సోనీ ఎఫ్ ఎస్ 7 కెమెరాతో షూట్ చేసారు. సినిమా తీయడానికి గంటన్నర్ర పాటు సమయమే అయినప్పటికీ, పర్ఫెక్షన్ కోసం 25 రోజుల పాటు రిహార్సల్స్ చేసామని స్పష్టం చేసాడు సాల్మన్.

ప్రముఖ దర్శకదిగ్గజం కె.బాలచందర్ దగ్గర పని చేసిన ఈ దర్శకుడు రూపొందించిన ఈ ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఎందుకంటే… సింగిల్ షాట్ అంటూ వర్మ “ఐస్ క్రీం” సినిమాలో షూట్ చేసిన దాదాపు 5 నిముషాల వీడియోకే ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. దీంతో ఈ సింగిల్ టేక్ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి మాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బహుశా తెలుగులోకి కూడా అనువాదం అవుతుందేమో చూడాలి.