Kanakamedala Ravindra Kumar Special Status Issueఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడానికి అధికార వైఎస్సార్సీపీ కార్యాచరణ ఏమిటో తెలియజేస్తే, అందుకు తగిన విధంగా మద్దతు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమంటూ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే చర్చలలో భాగంగా ముందుగా ప్రత్యేక హోదా చేర్చి ఆ తర్వాత తొలగించడం పట్ల వైసీపీ సర్కార్ కేంద్రంతో ఎలాంటి ఒప్పందం చేసుకుందో అన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన కనకమేడల, అజెండాలో ఉన్న హోదా అంశాన్ని ఎవరు చెబితే తొలగించారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.

28 ఎంపీలు ఉన్నప్పటికీ వైసీపీ ఏ మాత్రం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని, ప్రత్యేక హోదాపై వైసీపీ సర్కార్ తీరు వైఫల్యమా? లొంగుబాటా? అంటూ నిలదీసారు. హోదాపై మంచి జరిగితే వైసీపీకి, చెడు జరిగితే చంద్రబాబుకు అంటకట్టడం వైసీపీ నిత్యకృత్యం అయిపోయిందని విమర్శించారు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు, ప్రత్యేక హోదా సాధనకు వైసీపీ సర్కార్ ఏ విధంగా పోరాడాలని నిర్ణయించుకున్నారో చెప్తే, టీడీపీ మద్దతుగా నిలుస్తుందని, ఒకవేళ హోదా కోసం అందరు ఎంపీలు రాజీనామా చేయాలని నిర్ణయించినా, తాము సిద్ధమని ప్రకటించారు.

ప్రత్యేక హోదా సాధించలేనని జగన్ చెప్పినా, తెలుగుదేశం పార్టీ తమ కార్యాచరణను బహిరంగ పరుస్తుందని, ఏ విషయమో ప్రజలకు జగన్ వివరించాలని అన్నారు. ప్రత్యేక హోదా అంశం లేకుండా సీఎం జగన్ రాసిన లేఖనే కేంద్ర ఎజెండా మారడానికి ప్రధాన కారణంగా అభివర్ణించారు.